అమరావతి, సెప్టెంబర్ 20: తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు.
అమరావతిలో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు వంద రోజుల తరువాత ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.