Friday, September 20, 2024

Tirumala – నెయ్యి క‌ల్తీ వాస్త‌వం… తేల్చి చెప్పిన టిటిడి ఈ వో …

అమరావతి : తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేధికల ఆధారంగా కల్తీ జరిగినట్టు గుర్తించి సరఫరాదారు నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని పేర్కొన్నారు. తిరుమ‌ల‌లోని టీటీడీ భవన్‌లో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై వివరాలను వెల్లడించారు.

తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత, ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు.

గత జులై నెలలో లడ్డూలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశమై శుద్ధమైన నెయ్యి ని సరఫరా చేయాలని సూచించామని పేర్కొన్నారు. రూ. 320కు- రూ. 411 కే కిలో నెయ్యిరాదని అందరు చెబుతున్నందునే అనుమానం వచ్చి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ ఎన్‌డీడీబీ (నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) ల్యాబ్‌కు జులై 6న రెండు, జులై 12 న మరో రెండు ట్యాంకర్ల శాంపుల్లను పంపామని తెలిపారు. వారి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీ నుంచి వస్తున్న నెయ్యిలో ప్రమాణాలు లేవని, జంతువుల కొవ్వును వాడుతున్నారని నివేదిక ఇచ్చిందని ఆయన వెల్లడించారు. దీంతో వెంట‌నే నెయ్యి స‌ర‌ఫ‌రా సంస్థ‌కు నోటీస్ లిచ్చి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోళ్ల‌ను నిలిపివేశామ‌న్నారు..

- Advertisement -

టీటీడీ కి సొంత ల్యాబ్‌ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించలేకపోయారని ఈవో అన్నారు. దీంతో సరఫరాదారులకు కల్తీ్ నెయ్యి సరఫరా వరంగా మారిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డూ భక్తులకు అందుతుందని తెలిపారు. నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి అడల్ట్రీ ల్యాబ్‌ టెస్ట్‌ ఇక్విప్‌మెంట్‌ను విరాళంగా ఇచ్చేందుకు ఎన్డీబీబీ ముందుకు వచ్చిందని, విదేశాల నుంచి యంత్రాలు రావాల్సి ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement