జనవరి 9న ఎస్ఎస్ డీ టోకెన్ల జారీ
3వేల మంది పోలీసులు, 1550 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు
ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా 12వేల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ పాయింట్లు
ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే నిర్దేశించిన తేది, సమయం ప్రకారం క్యూలైన్ వద్దకు రావాలని విజ్ఞప్తి
టీటీడీ ఈవో జె.శ్యామలరావు
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు…
- 10వ తేది నుండి 19వ తేది వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి.
- జనవరి 10వ తేది ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. 8 గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి.
- జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
- అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్పస్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు.
- జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.
సర్వ దర్శన టోకెన్లు…
- తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లలో, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలోని 4 కౌంటర్లలో SSD టోకెన్లు జారీ.
- జనవరి 9వతేది ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు కేటాయింపు. 13వ తేది నుండి 19వ తేది వరకు ఏరోజుకారోజు టోకెన్లు జారీ. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ పదిరోజులకు గాను 4.32 లక్షల ఎస్ఎస్ డీ టోకెన్ల జారీ.
- తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమల వాసులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ.
- ఇప్పటికే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1.40 లక్షల SED టికెట్లను, 19500 శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినిహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
- తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేది, సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి.
- దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు.
- జనవరి 9వ తేదిన అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ నిలిపివేత.
- శ్రీవారి మెట్టు మార్గంలోని టోకెన్ జారీ కౌంటర్లు జనవరి 19వ తేది వరకు మూసివేత
- ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ పదిరోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
వసతి…
- పది రోజుల పాటు తిరుమలలో వసతి గదుల ఆన్ లైన్ బుకింగ్ రద్దు. సామాన్య భక్తులకు సీఆర్వోలో వసతి గదుల కేటాయింపు.
- 8వ తేది నుండి 11వ తేది వరకు 4 రోజుల పాటు తిరుమలలోని MBC, ARP, TBC, కాటేజ్ డోనార్ స్కీమ్ అలాట్మెంట్ కౌంటర్లు మూసివేత.
ట్రాఫిక్….
- తిరుమలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా దాదాపు 12 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు.
- యంబీసీ, ఔటర్ రింగ్ రోడ్ , రామ్ భగీచా ఏరియా, పరకామణి భవనం, అర్చక నిలయం సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు.
- టికెట్లపై ఎంట్రీ పాయింట్, అలైటింగ్ పాయింట్, పార్కింగ్ పాయింట్, పికప్ పాయింట్ వివరాలు ముద్రణ. ఆ వివరాల మేరకు తమకు కేటాయించిన సమయానికే వాహనాల్లో రావాలని భక్తులకు విజ్ఞప్తి.
భద్రతా ఏర్పాట్లు….
- తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో, తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తో పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
- తిరుమలలో 2770 సీసీ కెమెరాలు, తిరుమల తిరుపతి SSD కౌంటర్లలో అదనంగా 50 కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ.
అన్న ప్రసాదాలు….
- భక్తులకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా మంచినీరు, అన్న ప్రసాదాలు పంపిణీ.
- అన్న ప్రసాద కేంద్రాలతో, ఫుడ్ కౌంటర్లు ద్వారా అన్న ప్రసాదాలు పంపిణీ. సాంబారన్నం, పాలు, టీ, స్నాక్స్, మంచి నీరు పంపిణీ.
అలంకరణ….
- విద్యుత్, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి. మైసూర్ దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్ అలంకరణ. పౌరాణిక పాత్రలతో పుష్పాలంకరణ.
క్యూలైన్ల నిర్వహణ…
- క్యూలైన్ల నిర్వహణకు దాదాపు 3వేల మంది యువ శ్రీవారి సేవకులు, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవల వినియోగం.
పారిశుద్ధ్యం…
- తిరుమలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి. ఈ పదిరోజులకు గాను 2082 మందికి అదనంగా 150 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు.
ముఖ్యమైన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగింపు. తిరుమలలోని రోడ్లన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు.
ప్రచార విభాగం…
- టీటీడీ సమాచార కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎస్వీబీసీ నాలుగు చాన్లళ్లు, ఎస్వీబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్ సైట్స్, టీటీడీ సోషియల్ మీడియా, టీటీడీ బ్రాడ్ కాస్టింగ్ విభాగం ద్వారా విస్తృత ప్రచారం.
- భక్తులకు సమాచారం తెలిపేందుకు వీలుగా విరివిగా సూచిక బోర్డులు ఏర్పాటు.
- భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ చేసే కౌంటర్ల వద్ద గూగుల్ లొకేషన్ మ్యాప్స్ ఏర్పాటు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.