తిరుమల శ్రీవారిని నేడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన దర్శించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీపై విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఆంధ్రా, తెలంగాణ అంటూ చేసే కుట్రలను భగ్నం చేస్తామన్నారు. ఇప్పటికైనా కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై ఆలోచించాలని హితవు పలికారు.
హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో కబ్జాకు గురైన భూములను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చినట్లు దానం తెలిపారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అన్యాక్రాంతమైన ప్రాంతాల్లో నివాసం ఉన్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.