చరిత్ర హీనులుగా మిగిలేలా శిక్షిస్తాం
అమరావతి: తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సచివాలయంలో నేడు ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
“తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామి వారి లడ్డూ ఉంటే ఇళ్లంతా ఘుమఘులాడే వాసన వచ్చేది. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా..? స్వామి వారి అన్న ప్రసాదం స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టాం. తిరుమల శ్రీవారి విషయంలో నేను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా చేయం. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకూ ఉంది. అలాగని గత పాలకులు చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎవరినీ వదిలేది లేదు ..
కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని చెబుతూ.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు చంద్రబాబు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు .
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు.