తిరుమల – సెప్టెంబరు 23: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
గజ వాహనం – కర్మ విముక్తి
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, బోర్డు సభ్యులు అశ్వర్థ నాయక్, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.