నేటి రాత్రి అంకురార్పణ కార్యక్రమం
యాగశాలలో స్వామివారికి కైంకర్యాలు
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
ప్రతి రోజు ఉదయం, రాత్రి మలయప్ప స్వామి వాహన సేవలు
గరుడ సేవ రోజున భారీ ఏర్పాట్లు
ఆర్జిత సేవలు,విఐపి సిఫార్స్ దర్శనాలు రద్దు
రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తా రు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇక, శుక్రవారం సా యంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా గోవిందాచార్యులు వ్యవహరిస్తారు.
అర్జిత సేవలు రద్దు ..
రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని.. ఇప్పటికే ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు
టీటీడీ ఈవో శ్యామలరావు. నేటి ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 గంటలకు.. రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. గరుడ వాహన సేవ 8వ తేదీ రాత్రి జరుగుతుందన్నారు. వాహన సేవ దర్శనంతో పాటు మూలవిరాట్టు దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు. అలాగే విఐపి సిఫార్స్ లేఖలు ఈ తొమ్మిది రోజులు పరిశీలించబోమని చెప్పారు. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహన సేవ ఉంటుందని తెలిపారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడక దారులు తెరిచి ఉంచుతామని ప్రకటించారు. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు.
రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పుట్టు వస్త్రాలను చంద్రబాబు సమర్పించునున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు సీఎం బయలుదేరనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. అనంతరం రూ.13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత అన్నదాన సముదాయాన్ని 5వ తేదీన ప్రారంభించనున్నారు. 2025 టీటీడీ క్యాలెండరు, డైరీలను ఆవిష్కరించనున్నారు చంద్రబాబు