తిరుపతి, ఆంధ్రప్రభపరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మికతకు భంగం కలిగించొద్దని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కోరారు. త్వరలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నిత్యం అశేషంగా భక్తులు, ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. తిరుపతి నగరంలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సంచలనం అవుతుందని, కావున రాజకీయ పార్టీలు, మత సంఘాలు, ప్రజా సమూహాలు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
తిరుపతి నగర ప్రాశస్త్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలి. ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు చేయాలనుకున్నవారు ముందుగా పోలీస్ వారికి రోడ్ మ్యాప్ ను వివరించాలన్నారు. పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, చట్టాన్ని ఉల్లంఘించి వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఘర్షణలకు దారి తీసే పోస్టులు పెట్టడం, దుష్ప్రచారాలు చేసే వారిని ఉపేక్షించేదిలేదన్నారు. ప్రజల శాంతి భద్రతలే ముఖ్యమని వాటికి విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల చట్ట పరిధిలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.