Wednesday, November 20, 2024

ఏపీలో కొత్త వివాదం: సీఎం జగన్ సొంత జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం

ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు ముస్లింలతో కలిసి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్‌ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న కాషాయ నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఏర్పాటును మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. శుక్రవారం ప్రొద్దుటూరుకు  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి రానున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేసే ప్రాంతాన్నికి పరిశీలిచనున్నారు.

చరిత్రలో భారతదేశాన్ని పాలించిన రాజుల్లో టిప్పుసుల్తాన్‌ కూడా ఒకరు. టిప్పు సుల్తాన్‌కు చరిత్రలో భిన్న వాదనలు ఉంటాయి. కర్నాటకలో టిప్పు జయంతి ఉత్సవాలపై వివాదం కొనసాగుతోంది. తాజాగా ఏపీలోనూ టిప్పుసుల్తాన్‌ ప్రస్తావన మొదలైంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న స్ధానికంగా ఉండే ముస్లింలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఈ విగ్రహం ఏర్పాటు కాబోతోంది.

ప్రొద్దుటూరులోని జిన్నారోడ్డు సర్కిల్లో విగ్రహ ఏర్పాటుకి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇకపై టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్య్ర యోధుడు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మతసామరస్యానికి మారుపేరైన ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు.

హిందువులను ఊచకోత కోసిన ఈ దేశ ప్రజలు వ్యతిరేకించే టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే నిర్మాణాం చేయడం సిగ్గుచేటు అని విమర్శిస్తున్నారు.  విగ్రహం ఏర్పాటు చేసే ముందు అతని జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ స్థానంలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు, బీజేపీ శ్రేణులు వ్యతిరేకించినా నిర్మాణానికి సన్నాహాలు చేయడంపై కమల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంశాలతో రాష్ట్రంలో శాంతిబద్రతలకు విఘాతం కలుగుతుందని అంటున్నారు.  జిల్లా అధికారులు విగ్రహనికి అనుమతి ఇవ్వవద్దని, అక్రమ విగ్రహ నిర్మాణంపై ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement