నల్లమలలో వేటగాళ్ల ఉచ్చులకు పెద్దపులులు బలి అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో నంద్యాల డివిజన్ లోని చలమ రేంజ్, పెద్ద కమ్మలూరు సెక్షన్ లో ఒక పులి ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. ఈ ఘటన బయటపడితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందనుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు దాని ఆనవాళ్లు లేకుండా తగలబెట్టినట్టు తెలుస్తోంది. అట్లాగే ఈ ఏడాది కాలంలో దాదాపు 5 పెద్ద పులులు వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.
కర్నూలు, ప్రభన్యూస్: ఈ మధ్య కాలంలో వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై నంద్యాల డీఎఫ్‌వో స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ తర్వాత పులి మృతిచెందిన ఆనవాళ్లు లేవని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చింది అవాస్తవంగా పేర్కొన్నారు. పులి చనిపోయిన ఘటనపై అవాస్తవంగా డీఎఫ్‌ఓ అలా ప్రకటించారో లేదో.. నల్లమల్ల అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలి అయ్యిందన్న విషయం వాస్తవమే అని తేలింది. అయితే.. ముందుగా వెల్లడైన విధంగా కాకుండా అహోబిలం రిజర్వాయర్ వద్ద పెద్దపులి డెడ్‌బాడీ లభ్యం కావడం గమనించదగ్గ విషయం. ఒక్కసారిగా ఈ విషయం అటవీశాఖ అధికారులో కలకలం రేపింది. హుటాహుటిన అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకొని పులి మృతదేహాలను గుర్తించారు. అహోబిలం రిజర్వాయర్‌లో నీరు తాగేందుకు వచ్చి.. వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి పులి చనిపోయినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఈ విషయంలో మరింత దర్యాప్తు చేస్తున్నట్టు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో అహోబిలం అటవీ ప్రాంతం సమీపంలో ఉచ్చులు వేసి పులి మృతికి కారణంగా భావిస్తూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అహోబిలం రిజర్వాయర్ పరిధిలో.. వేటగాళ్ల ఉచ్చుకు బలైన పెద్దపులి మృతి వెనుక స్థానిక వ్యక్తుల హస్తం ఉందా.. లేదా అంతర్జాతీయ వేటగాళ్ల పనా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ప్రస్తుతం అహోబిలం రిజర్వాయర్ వద్ద వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని చనిపోయిన పులి మృతదేహం నుంచి నాలుగు కాళ్లకు ఉన్న పులిగోర్లను తొలగించడం కనిపించింది. వీటితో పాటు పెద్దపులి ముందు పాదాల వద్ద యు ఆకారంలోని ఎముకలను కూడా తొలగించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
బ్లాక్ మార్కేట్ లో పులి ఖరీదు..
పులి చర్మం, గోళ్లు, ఇతరత్ర అవయవాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పులి గోళ్లు, చర్మం విలువ రూ .25లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. మాఫియా సామ్రాజ్యంలో దేశంతో పాటు, చైనా, జపాన్, కొరియా మరికొన్ని దేశాల్లో పులుల మూలంగా అతీత శక్తులు లభిస్తాయన్న నమ్మకం ఉంది. ఈ నమ్మకమే పులుల ప్రాణానికి ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా పులి చర్మంతో కోటు కుట్టించుకుంటే కోటీశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. పులి గోళ్లను ఆలంకరణకు ఉపయోగిస్తారు. పులిగోళ్లు మెడలో ధరించడాన్ని ఎంతో గొప్పగా భావిస్తారు. ఈ గోళ్లు ధరించే వ్యక్తులకు ధైర్యంతో పాటు ప్రతి పనిలో పులిలా ముందుకు దూసుకెళ్తారనే భావన ఉంది. పులి ముందు కాళ్లలో యూ ఆకారంలో వచ్చే ఎముకల పొడిని లైంగిక శక్తి సామర్ధాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు. ఇందుకోసం ఎంత డబ్బైనా వెచ్చించేందుకు వెనుకాడరు.
చైనా, తైవాన్, హంకాంగ్ వంటి దేశాల్లో పులికి చెందిన ప్రతి అవయవం రూ.లక్షల్లో ధర పలుకుతుంది. చివరకు పులి మూతి వద్ద ఉండే వెంట్రుకలు యంత్రంలో ఉంచి ధరించడం వల్ల అతీత శక్తులు వస్తాయనే నమ్మకం ఉంది. వాస్తవానికి పులి ముక్కునుంచి తోక చివరి వరకు పులి పదిన్నర అడుగుల పొడవు ఉంటుంది. దాదాపు 200 నుంచి 290 కిలోల బరువు ఉంటుంది. అందుకే నల్ల బజారులో పులి చర్మం నుంచి గోళ్ల వరకు భారీగానే ధర పలుకుతున్నట్టు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో పులి చర్మంకు అత్యంత డిమాండ్ ఉండటంతో నల్లమల అడవుల్లో ఖత్నీ తెగకు చెందిన వేటగాళ్లు నిరంతరం ఉచ్చులతో పులులను వధించి విక్రయిస్తుంటారు. ఈ విషయం అటవీ అధికారులకు తెలిసినా వేటగాళ్ల ముందు చేతులు ఎత్తేయడం తప్పా పులులను సంరక్షించింది లేదనే ఆరోపణలున్నాయి.
పులుల సంరక్షణకు ఏటా కోట్ల వ్యయం..
నల్లమల పులుల అభ్యయారణ్యంగా ప్రసిద్ధి. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. అటువంటి అభయారణ్యంలో పులుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఎక్కువగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని బ్లాక్ 2 గుండ్ల బ్రహ్మేశ్వరం, పచ్చర్ల, పెచేరువు, బైర్లూటి, నాగలూటి, రుద్రకోడూరు, వెలుగోడు, అహోబిలం ప్రాంతంలోని రుద్రవరం తదితర ప్రాంతాల్లో సంచరిస్తాయి. యేటా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేక బృందాలతో అడవిలోని పులుల లెక్కింపు చేపడతారు. యానిమల్ ట్రాకర్, బేస్‌క్యాంపు వాచర్‌తో నలుగురు సభ్యులున్న బృందాలను ఏర్పాటు చేసి పులుల గణన నిర్వహిస్తారు.
ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో పులి పై రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం నల్లమల్ల జీబీఎం నుంచి కడప జిల్లా బాలయపల్లె రేంజి వరకు టైగర్ కారిడార్ విస్తరించి ఉంది. ప్రస్తుతం నల్లమలలో 80 వరకు పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. ఆహార అన్వేషణలో అంతరిస్తున్న పులులు ఇటీవల ఆహార అన్వేషణలో పులులు మరణిస్తూ ఉండడం వన్యప్రాణి ప్రేమికులను కలవరానికి గురిచేస్తున్నది. ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారినపడి మృత్యు వాతపడుతున్నాయి. ఒక వైపు పులుల సంతతి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు వేటాడే నేపథ్యంలో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి.
రెండేళ్లలో మృతిచెందిన పులుల వివరాలు..
2020 జనవరి 20వ తేదీ కర్నూలు-గుంటూరు రహదారిపై నల్లమలలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడే క్రమంలో ఓ చిరుతకూన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. 2020 ఏప్రిల్‌లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండలో అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకోలేక ఓ పెద్ద పులి మృతి చెందినట్లు అటవీశాఖ రికార్డులను బట్టి వెల్లడైంది. అలాగే 2021 నవంబర్ 12న గిద్దలూరు-నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి ఓ పెద్ద పులి మృతి చెందింది. తాజాగా కోతిని వేటాడే క్రమంలో మరో చిరుత బావిలో పడి చనిపోయింది. ఈనెల 6న ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా పులులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది.పులలు సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. గడిచిన రెండేళ్లలో రెండు చిరుతలు, పెద్ద పులులు మృతి చెందాయి. జంతువులను వేటాడుతూ అడవిలో నుంచి రోడ్లపైకి, రైల్వేట్రాక్‌లపైకి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తూ వాహనాలు ఢీకొని పులులు మృతిచెందుతున్నాయి.
అడవుల్లో సరైన నీటి వసతులు లేకపోవడంతో జనారణ్యంలోకి వెళ్లే క్రమంలోనూ రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. పొలాల్లో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులు, విద్యుత్ సరఫరాతో కూడిన కంచెల్లో చిక్కుకుని కూడా పులులు మృతి చెందుతున్నాయి. తాగునీటి సమస్య లేకుండా రూ.లక్షలు పెట్టి సాసర్ పిట్లు ఏర్పాటు చేస్తున్నా నీటిని నిల్వ చేయకపోవడం శాపంగా మారింది. వేటగాళ్ల ఆనవాళ్లు పసిగట్టేందుకు అడవిలో కెమెరాలు బిగించారు. దోర్నాల-శ్రీశైలం, శ్రీశైలం-తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ పరిధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పులుల సంచారం ఉన్నందున అటవీశాఖ గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేస్తోంది. వేల మంది సిబ్బంది పనిచేస్తున్న తరచూ ఏదో ఒక చోట పులులు మరణిస్తునే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..