ఏలూరు జిల్లాలో పులుల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇటీవల పులుల సంచారం కలవర పెడుతుంది. తాజాగా సత్తెన్నగూడెం గ్రామ శివారులోని ఒక తోటలో రం పెద్ద పులి జాడలు కనిపించాయి. దాంతో ఆ ప్రాంత వాసులు జంకుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల మండలాల ప్రజలను గత ఐదు రోజుల నుంచి పులి భయం వెంటాడుతోంది. తాజాగా ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెం శివారులోని ఒక తోటలో రైతులకు పులి జాడలు కనిపించాయి. దాంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్వీకే కుమార్, డీఆర్వో రామలింగాచార్యులు, సెక్షన్ అధికారి జగదీష్, బీట్ అధికారులు మెహబూబ్, కె.దుర్గారావు, సిబ్బంది ఉదయం పులి పాద ముద్రలను ప్లాస్టరాఫ్ ప్యారీస్ ద్వారా సేకరించారు.
అవి పెద్ద పులి పాద ముద్రలేనని వారు ప్రాథమికంగా అంచనా వేశారు. దాన్ని నిర్ధారించేందుకు వైల్డ్‌లైఫ్ ల్యాబ్‌కు పాదముద్రను పంపారు. అలాగే చుట్టు పక్కల పొలాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు.గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గేదెలను, ఆవులను, మేకలను బయట కట్టివేయవద్దన్నారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే 1800 4255 909 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.