Friday, November 22, 2024

Tiger Horror – పశ్చిమగోదావరి పులి కలకలం … నాలుగు మండలాల ప్రజలలో భయం భయం ..

గలగల పరుగులు తీసే గోదారి పశ్చిమ దిక్కులో.. ఏనాడో అడవి బతుకు తెల్లారిపోయింది. అడవి జాడేలేదు. బొగ్గు బట్టీలతో సగం అంతరించి పోతే.. అన్ని మామిడి, ఫాయాయిల్ తోటలతో అడవి ముఖచిత్రమే మారిపోయింది. కనీసం జంగుపిల్లి కూడా కనిపించని ఈ స్థితిలో.. అకస్మాత్తుగా పెద్దపులి ప్రత్యక్షమైంది. పాపం ఆకలితో తహతహలాడుతూ.. ఊళ్లల్లో తిరుగుతోంది. కనీసం ఆవు కాక పోతే దూడ.. అవీ దొరకక పోతే మేకల కోసం గాలిస్తోంది. అంతే.. ఊళ్లల్లో జనం నాన్నా పులి వచ్చే అని గావుకేక పెడుతుంటే.. అటవీ శాఖ అధికారులు పులి ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. పులి అడుగుజాడల్ని చూపిస్తే.. జరభ్రదం, ఒంటరిగా తిరగొద్దని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇంతకీ ఈ పులి ఎక్కడిది? ఎక్క‌డి నుంచి వచ్చింది. ఏ ప్రాంతంలో సంచరిస్తుంద‌నే దానిపై అంద‌రిలో భ‌యాందోళ‌న నెల‌కొంది.

(ప్రభన్యూస్, ఏలూరు బ్యూరో ) – ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా పులి అలజడి సృష్టిస్తోంది. అడవిలో తిరగాల్సిన పెద్దపులి ఊళ్లపై పంజా విసురుతోంది. ఊరూరా పులి తిరుగుతూ జీవాల కోసం మాటు వేస్తుంటే.. గ్రామీణ ప్రాంత జనం హడలిపోతున్నారు. ఏ నిమిషంలో ఏ గ్రామంలో పులి హాని ఎదురవుతుందో? తెలీక ప్రాణాలు అరచేత పట్టుకుని జనం బిక్కు బిక్కుమంటున్నారు. వామ్మో పులి, వాయ్యో పులి అని ఊరూర జనం కథకథలుగా చెప్పుకొంటుంటే… ఈ సమాచారం వెలుగు చూసింది. అటవీశాఖ కూడా ఎట్టకేలకు స్పందించింది. పెదవేగి, దెందులూరు, ద్వారకాతిరుమల, నల్లజర్లమండలాల్లోనే ఈ పులి జాడను గుర్తించింది. రోజుకో ప్రాంతంలో పులి ప్రత్యక్షమవుతోంది. తోటల్లోని పశువుల పాకలపై దాడికి దిగుతోంది. ఈ భయానక ఘటనలు వరుసనే వెలుగులోకి వస్తున్నాయి.

ద్వారకా తిరుమల మండలం దేవినేని వారి గూడెంలోని ఓ తోటలోని పశువుల పాకపై దాడి చేసింది. ఓ ఆవు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికాయి. అంతే ఆ ప్రాంత జనం గజగజ వణికి పోతున్నారు. ఇక పెదవేగి మండలం మొండూరు, దెందులూరు మండలం మేదిని వారి పాలెం, పెరుగు గూడెం గ్రామాల్లోనూ ఈ పెద్ద పులి అలజడి సృష్టించింది. ఈ పులి అడుగుజాడలతో పులి సంచారం నిజమేనని అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులూ రంగంలోకి దిగారు రాజమండ్రి సర్కిల్‌ ఫ్లయింగ్ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ త్రిమూర్తులు రెడ్డి, ఏలూరు జిల్లా డీఎఫ్ఓ రవీంద్ర ధామ, ఈ ప్రాంతాల్లో పర్యటించారు. గాయపడిన పశువులను పరిశీలించారు. పులి పాదముద్రలను సేకరించారు. దేవినేని వారి గూడెం, రామన్నగూడెం తదితర గ్రామాల్లో పొలాల్లోకి వెళ్లే రైతులు, కూలీలు, ఇతరలు ఒంటరిగా తిరగొద్దని, అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి జాడ కనిపిస్తే తమకు సమాచారం అందించాలని జనాన్ని అప్రమత్తం చేశారు. అనుకోని ఘటన జరిగితే బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామని అధికారులు సముదాయించారు.

నల్లజర్ల రిజర్వు పారెస్టులో …

ఇక చల్ల చింతలపూడి గ్రామంలో దొరికిన పులి పాద ముద్రల ఆధారంగా పులి ఆనుపోనులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఒక్కోచోట ఒక్కోరకంగా పులి పాదముద్రలు కనిపించటంతో పెద్దపులి ఒక్కటా.. రెండా అనే అనుమానం కలుగుతోంది. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి.. అటవీ శాఖకు సమాచారం అందించారు. 13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్టు నిర్ధారిస్తారు. నాలుగు రోజుల కిందట నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు-దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకాతిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది. ద్వారకాతిరుమల మండలం దేవినేని వారి గూడెంలో ఆవులపై పులి దాడి చేసింది.

పులిజాడ కోసం కెమెరాల ఏర్పాటు
వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నల్లజర్ల మండలం పుల్లలపాడు సమీపంలోని నల్లజర్ల రిజర్వు ఫారెస్టులో పులి సంచరిస్తోందని , ప్రస్తుతం పులి తిరుగు ప్రయాణంలో ఉందనిడీఎఫ్ఓ రవీంద్ర ధామ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ఎన్‌.టి.సి.ఎ. సాంకేతిక పరిజ్ఞానంతో కెమెరాలు ఏర్పాటు చేసి…నిరంతరం పులి కదలికలను అంచనా వేసేందుకు పెట్రోలింగ్ టీములు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పులి జాడ కోసం ఊరూరా,.. అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. పులి సంచార గ్రామాల్లోని మెకుల్లో పులి పట్ల జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తగు జాగ్రత్తల సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

మరో దూడను ఆరగించిన పెద్దపులి
ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడిఘటన కలవరం రేపింది. మంగళవారంతెల్లవారుజామున ఓదూడను చంపిన పులి సమీప అడవిలోకి లాక్కు వెళ్లి ఆరగించిన విషయాన్ని స్థానికులుగుర్తించారు పెద్దపులిని చూసి భయంతో స్థానిక రైతు చెట్టెక్కారు. రైతుకళ్ళముందే దూడను పులిలాక్కుని వెళ్ళింది. రైతుసమాచారంతోఘటన స్థలానికి స్థానిక రైతులు, ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. వరుసగా పులి దాడి ఘటనలతో జనం బేబేలెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement