Friday, November 22, 2024

టిడ్కో వారు దొరకరు…మున్సిపాలిటీ వారు చెప్పరు..

విజయనగరం, ప్రభన్యూస్ : టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (టిడ్కో) ఇళ్ల లబ్ధిదారుల గోడు పట్టించుకున్న నాధుడు జిల్లాలో మచ్చుకైనా లేకపోయాడు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులైన వారిలో ఎంత మంది ప్రస్తుత జాబితాలో వున్నారు? ఎంత మందికి రిక్తహస్తం చూపుతున్నారు? వంటి వివరాలేవీ ఎవరికీ అంతుపట్టని దుస్థితి. గత టీడీపీ ప్రభుత్వం నిర్దేశించిన డిపాజిట్‌ మొత్తాన్ని సగానికి తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన బంపర్‌ ఆఫర్‌ ఎంతమందికి లబ్ధి చేకూర్చింది? అన్న విషయం పైనా స్పష్టత కొరవడింది. వాస్తవానికి టిడ్కో ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అటు టిడ్కో వద్ద గానీ ఇటు మున్సిపాలిటీ కార్యాలయాల్లో గానీ లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో 50శాతం చెల్లిస్తే చాలన్న వైసీపీ ప్రభుత్వ ఆఫర్‌ను అనుసరించి ఎంత మందికి లబ్ధి చేకూరింది అన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే.

అక్టోబర్‌ 20న జిల్లా కలెక్టర్‌ స్వయంగా నిర్వహించిన సమీక్షలో కూడా పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానాలు లేవన్నది బయటివారికి తెలియకపోయినా సమీక్ష జరిపిన సర్వోన్నతాధికారికి తెలియనిది కాదు. ఈనేపథ్యంలో లబ్ధిదారుల గందరగోళ పరిస్థితులకు తెరదించేది ఎవరు? 50 శాతం తిరిగి చెల్లింపుల విషయంలో మున్సిపల్‌ అధికారులు వివక్ష చూపారన్న ఆరోపణలు కూడా వున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 60 నుంచి 70 శాతం పూర్తయిపోయనుకున్న టిడ్కో ఇళ్లకు నేటికీ అతీగతీ లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా వెళ్లడించాలని, నిర్దేశిత మొత్తాన్ని ముందుగా చెల్లించిన వారిలో ఇంత వరకు 50 శాతం వెనక్కి జమకాని వారికి వెంటనే ఆమొత్తం జమయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement