Wednesday, January 29, 2025

AP | త్వరలోనే టిడ్కో ఇళ్ల ప్రవేశాలు.. టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : పూర్తి నివాసయోగ్యంగా టిడ్కో గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జూన్ నాటికి లబ్ధిదారుల చేతికి ఇంటి తాళాలు ఇస్తామని టీడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకు ఇబ్బందులను సైతం పరిష్కరించి త్వరలోనే టిడ్కో గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో చేయించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడిలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం ప్రారంభించి సగంలో ఉన్న టిడ్కో గృహాలను ఆయన శనివారం పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిడ్కో లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం భారీ నజరానా ఇస్తోందని చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణం మంజూరైన లబ్దిదారులకు వాయిదాలు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్న సందర్భంలో వారు కట్టాల్సిన వాయిదాలు డిసెంబరు వరకు కలిపి రూ.150కోట్లు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు నాలుగున్నర లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, రూ.39వేల కోట్లతో జర్మనీ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఆపేసిందన్నారు. నాలుగున్నర లక్షల మంది లబ్దిదారులు ఉంటే 2.60 లక్షల మందికే ఇళ్లు కేటాయించారని, వాటికి కూడా నిధులు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారన్నారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజా ధనం వృధా అయ్యిందన్నారు. జగన్ ప్రభుత్వం మాట నిల పెట్టుకుని ఉంటే.. టిడ్కో ఇళ్లు కలకల్లాడి ఉండేయన్నారు.

జక్కంపూడితో పాటు అన్ని ప్రాంతాల్లోనూ టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్నామన్న ఆయన ఇటీవల చంద్రబాబు సమీక్ష చేసి పనులు చేపట్టాలని‌ ఆదేశించారని చెప్పారు. 4500కోట్లు హడ్కో రుణం కూడా మంజూరు చేయించారని, జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామ‌ని ప్రకటించారు. మౌలిక వసతులను పూర్తి చేసి నివాస యోగ్యంగా మారుస్తామ‌న్నారు. ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు కూడా గత ప్రభుత్వం తీసుకుందని, వాయిదాలు కట్టే విషయంలో బ్యాంకులతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామ‌న్నారు.

- Advertisement -


150కోట్లు బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందని, టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతలకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామ‌న్నారు. పనులు వేగవంతం చేసేలా కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడుతున్నామని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా వారికి చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు.

టిడ్కో ఇళ్ల లబ్దిదారులు త్వరలోనే గృహ ప్రవేశాలు చేస్తారని, నిర్మాణంలో ఉన్న బ్లాక్ ల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామ‌న్నారు. రూ.50 వేలు, లక్ష చొప్పున టిడ్కో లబ్దిదారులు చెల్లించగా, ఇతర సొమ్ము బ్యాంకుల నుంచి రుణం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందాలు జరిగాయని, నిజమైన లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. 300 చ.ద అడుగుల ప్లాట్ల‌‌ విషయంలో‌ గోల్ మాల్ జరిగిందని, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు జనసేన నేతలు అక్కల గాంధీ, అమ్మిశెట్టి వాసు, ఇతరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement