Tuesday, November 26, 2024

Ticket War – టీడీపీ కంచుకోటలో టిక్కొట్లాట!… ఉండి రాజ్యం నాదంటే నాది అంటున్నరాజులు…

ఆంధ్రప్రభ స్మార్ట్, – అది టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి.. నలబై ఏళ్ల రాజకీయ చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే.. అదీ దివంగత సీఎం వైఎస్ఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ విజయభావుటా ఎగురవేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే చాలు.. తెలుగుదేశం పార్టీ రాజ్యం అని మారు పేరు వినపడుతుంది. ఈ నియోజకవర్గంలో క్షత్రియ అభ్యర్థులే రారాజులు. 1983 నుంచి 1999 వరకూ‌‌ టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి రామచంద్రరాజు ఉండిలో రాజ్యమేలారు. 2004లో ఆయన రాజకీయ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు 19,488 ఓట్ల మెజారిటీతో టీటీపీ అభ్యర్థి కలిదిండి రామచంద్రరాజుపై విజయం సాధించారు. ఆ 2009, 2014 ఎన్నికల్లో వేటుకూరి వెంకట శివ రామరాజు టీటీపీ సత్తాను చాటారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీకి ఉండి జనం చాన్స్ ఇవ్వలేదు. అంతటి టీడీపీ కంచుకోటలో..టిక్కెట్టు కొట్లాట తెరమీదకు వచ్చింది. అంతర్గత వర్గపోరు సాగుతోంది. ఇటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. అటు మాజీ ఎమ్మెల్యే టికెట్‌ నాదంటే నాదని పోటీపడుతున్నారు. సీటు తమదేననే ధీమాతో ఎవరికి వారే ప్రచారం ప్రారంభించారు. ఈ స్థితిలో ఎవరి వైపు ఉండాలో అర్థం కాక పసుపు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఏ దశకు చేరుతుందో? అధిష్టానం ఏ రీతిలో పరిష్కరిస్తుందనేది పెద్ద ప్రశ్న.

అసలేం జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో 2019 వైసీపీ హవాలోనూ ఈ జిల్లాలో గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. వైసీపీ అభ్యర్థి పీవీఎల్ఎన్ రాజుపై టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు 10,949 ఓట్ల మెజారిటీ గెలిచారు. ఇదే నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వీవీ శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను గమనించిన టీడీపీ అధిష్టానం.. 2019లో నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో శివరామరాజు ఓడిపోయారు. నిజానికి శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్‌ను టీడీపీ అధిష్టానం ఇచ్చింది. ఆ అవకాశం సద్వినియోగంతో రామరాజు ఉండి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్‌ ఖాయమైందని, పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు.

ఇక్కడే కథలో మలుపులు

నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు వైసీపీని వీడి పసుపు సేన గడప తొక్కారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మళ్లీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజుకే టిక్కెట్టు లభిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ స్థితిలో ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బరిలోకి వస్తే.. వీవీ శివరామరాజు రాజకీయ భవిష్యత్తుకు బ్రేక్ పడినట్టే. ఈ స్థితిలోనే శివరామరాజు, రామరాజు మధ్య అంతర్గత పోరు ఆరంభమైంది. ఎంపీగా అవకాశం దొరకదు, ఇలాంటి స్థితిలో ఉండి నుంచి పోటీ చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తన ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు వినియోగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని శివరామరాజు సూచించడంతో.. ఎమ్మెల్యే రామరాజు మరోచోట టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. . దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు తికమక పడుతున్నారు.

- Advertisement -

ఇద్దరి మధ్య.. తగువు తీరేనా?

మూడేళ్లుగా రాజకీయాలకు దూరమైన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసినంత మాత్రాన తాను ఉండికి దూరం కానని , ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతున్నారు. మరోవైపు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు కూడా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తనను కాదని.. ఇప్పటికే ఒకసారి ఛాన్స్‌ ఇచ్చిన వారికి మళ్లీ అవకాశమెలా ఇస్తారని మంతెన రామరాజు ప్రశ్నిస్తున్నారు. ఈ స్థితిలో టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలు విడిపోతే ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటని కార్యకర్తలతలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు నేతల మధ్య తగువులాటను అధిష్టానం ఏరీతిలో తీర్చుతుంది? రెండు పిల్లుల మధ్య కోతి పంచాయితీ మార్గంలో… కొత్త ముఖాన్ని రంగంలోకి దించుతుందా? అనేది కార్యకర్తల ప్రశ్న.

Advertisement

తాజా వార్తలు

Advertisement