అమరావతి, ఆంధ్రప్రభ: ‘మద్యం షాపు ల్లో పనిచేసే ఉద్యోగులు రూ.3 లక్షలకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పూచీకత్తు ఇవ్వండి…’ అంటూ ఏపీబీసీఎల్ నుంచి సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లకు తాఖీదులు అందాయి. వచ్చే నెల నుంచి పూచీకత్తు ఇస్తేనే జీతాలుచెల్లిస్తాం..ఉద్యోగాల నుంచి కూడా తీసేసేందుకు వెనుకాడబోమని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,934 మద్యం షాపులు, మరో 800 వందల వరకు ఉన్న వాక్ ఇన్ స్టోర్‌ఒ్సలో 14వేల మంది వరకు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు పని చేస్తున్నారు. ఇటీవల నగదు దుర్వినియోగం, సరుకు మాయం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో అధికారులు తాజాగా ష్యూరిటీ నిబంధన విధించారు. ఔటు సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న తమను ఇతర ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా పూజీకత్తు అడగడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత మనుషులకే ప్రభుత్వ ఉద్యోగులు ష్యూరిటీ పెట్టేందుకు సందేహిస్తున్న నేపధ్యంలో తమకు ఉన్నట్టుండి ఈ తరహా నిబంధన పెట్టడమేంటనేది వారి అభిప్రాయం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం, బార్ పాలసీలను రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మద్యం షాపుల నిర్వహణ ఏపీ బీసీఎల్‌కు అప్పగించారు. ఇందులో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్, వాచ్‌మెన్లను ఏపీబీసీఎల్ ఔటు సోర్సింగ్ విధానంలో తీసుకుంది. ఒక్కొక్క షాపులో షాపు స్థాయిని బట్టి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఔటు సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.3లక్షలకు పూచీకత్తు ఇస్తేనే జీతాలు ఇస్తామంటూ ఏపీబీసీఎల్ అధికారులు నిబంధన విధించారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే జీతాలు ఆపేయడంతో పాటు పూచీకత్తు ఇస్తేనే ఉద్యోగాల్లో కొనసాగిస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు..
గత మూడేళ్లుగా పలు మద్యం షాపుల్లో నగదు లావాదేవీలు అవకతవకలు చోటు చేసుకోవడం..రికవరీ చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొత్తగా పూచీకత్తు విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. కొత్త మద్యం పాలసీని 2019లోనే రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రైవేటు నిర్వహణలోని 4,382 మద్యం షాపులను ఏపీ బీసీఎల్ పరిధిలోకి తీసుకొచ్చారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా షాపుల సంఖ్యను 2,934 కు కుదించారు. ఇదే సమయంలో వాక్ ఇన్ స్టోర్స్ పేరిట మరో 800 వరకు షాపులు ఏర్పాటు చేశారు. అన్నింటిలో కలిపి 14వేల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని షాపుల్లో తరుచూ ఏదో ఒక జిల్లాలో నగదును ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. తొలి రోజుల్లోనే విజయవాడలో వెలుగు చూసిన రెండు ఘటనల్లో రూ.32లక్షల వరకు నగదు లావాదేవీల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో రూ.లక్షల నగదును ఉద్యోగులు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టినప్పటికీ..రికవరీ ఆ స్థాయిలో జరగడం లేదని అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం సీరియస్..
మద్యం షాపుల్లో నగదు స్వాహాతో పాటు కొన్ని షాపుల్లో మద్యం మాయంపై కొంత కాలంగా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పలు సమీక్షా సమావేశాల్లో ఎక్సైజు మంత్రి కే.నారాయణ స్వామి రికవరీపై సీరియస్‌గా దృష్టిసారించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఆదాయం వచ్చే శాఖలపై సీఎం నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో సైతం నగదు మాయం అంశం చర్చించినట్లు తెలిసింది. నగదు లావాదేవీల వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో కట్టడికి అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు చెపుతున్నారు.
27న నిరసన..
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో రూ.3లక్షలకు పూచీకత్తు ఇవ్వాలంటూ ఏపీబీసీఎల్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌నలు నిరసలు తెలపనున్నట్లు రాష్ట్ర బేవరేజెస్ ఔటుసోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాక మధు తెలిపారు. అవసరమైతే భవిష్యత్ ఆందోళనకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించిన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగాల్లో కొనసాగాలంటే పూచికత్తు తప్పని సరి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యపడేది కాదంటూ నెలాఖరు నాటికి యాజమాన్యం పూచీకత్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే చలో విజయవాడకు పిలుపు ఇవ్వడంతో పాటు అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని మధు హెచ్చరించారు.