ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖా పులివెందుల చేరుకున్నారు. మూడు రోజులపాటు ఆయన ఇక్కడే గడపనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారిగా పులివెందులకు వచ్చారు. శనివారం ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరిన జగన్ మధ్యాహ్నం 1.30 గంటకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈసందర్భంగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కె సురేష్ బాబు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కార్పొరేటర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున విమానాశ్రయాన్ని చేరుకున్న వైసీపీ కార్యకర్తలు జై జగన్.. జగనన్న జై.. అంటూ నినాదాలు చేసారు. అనంతరం వైఎస్ జగన్ కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందుల చేరుకున్నారు. స్థానిక నేతలు కార్యకర్తలతో వైసీపీ అధినేత మాట మంతి నిర్వహించారు.
కాగా.. ఆదివారం, సోమవారం కడప జిల్లా నేతలు, ప్రధానంగా పులివెందుల కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు. రాత్రికి పులివెందుల లోనే బస చేస్తారు.
ఓటమిపై సమీక్ష.. కార్యాచరణపై దిశ నిర్దేశం
రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేక పోవడానికి గల కారణాలు.. అందులోనూ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాల్లో ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. పులివెందులలో జగన్ పాటు జిల్లాలో మరో ఇద్దరు మాత్రమే గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిస్థితుల నడుమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం.. క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నడపటం కోసం కార్యకర్తలతో పాటూ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జగన్ హామీ ఇవ్వనున్నారు.
జగన్ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం..
జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా కడప నగర శివార్లలోని రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.