కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు, ఓ డ్రైవర్ కలిసి రెండు కార్లలో శనివారం విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి రాత్రి తిరుగుపయనయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలోకి వచ్చేసరికి విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు నేరుగా పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన విద్యార్థులను ఉదయ్‌కిరణ్, హర్షవర్ధన్, హేమంత్‌గా గుర్తించారు. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..