విజయవాడ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేసిన నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో అతను హోంమంత్రి అనితను కూడా బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడు విజయవాడకి చెందిన నూక మల్లిఖార్జున్ గా పోలీసులు గుర్తించి అతడిని పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చివరకు అతడిని ఇవాళ ఉదయం విజయవాడలోనే పట్టుకున్నారు. దీంతో అతన్ని స్థానిక పీఎస్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేషీ నంబర్లు ఎలా దొరికాయి, ఫోన్ చేసి ఏమేం మాట్లాడాడన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, నూక మల్లిఖార్జున మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఇలా బెదిరింపు కాల్స్ చేసినట్లు నిర్ధారించారు. గతంలో ఇలా ఎవరెవరిని బెదిరించాడన్న దానిపై నూక మల్లిఖార్జునను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా గతంలో వైజాగ్ లో నూక మల్లిఖార్జునపై 354 కేసు నమోదు అయినట్లు గుర్తించారు. దీంతో ఇంకా ఏయే పోలీసు స్టేషన్లలో అతనిపై కేసులున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.