ఏపీలో కృష్ణపట్నం కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే ఆనందయ్య ఆయుర్వేద మందుకి ఆయుష్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయుర్వేద మందు ప్రమాణాలకు లోబడి ఉందని.. హానికరం కాదని ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. దీంతో ఆయుర్వేద మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈరోజు మందు పంపిణీ చేస్తారని తెలియడంతో వేల సంఖ్యలో బాధితులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దగ్గరుండి మరీ ఆయుర్వేద మందు పంపినీ చేశారు. అయితే జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. కనీస సామాజిక దూరం.. కరోనా నిబంధనలు పాటించకపోవడంతో తాత్కాలికంగా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెనుదిరిగారు. అయితే ఐసీఎంఆర్ నివేదిక వచ్చిన తరువాతే ఆనందయ్య మందు పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కరోనాకు ఆయుర్వేద మందు అందుబాటులోకి రావడం కరోనా రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ కృష్ణపట్నంలో ఓ వైద్యుడు కనిపెట్టిన ఆయుర్వేద మందు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా నుంచే కాక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తుండటంతో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లతో పాటు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామానికి వెలుపల పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.