ఎమ్మిగనూరు అర్బన్, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్): జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సెక్యులర్ పార్టీలుగా వ్యవహరించడం లేదని హీరో సుమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. శుక్రవారం సినిమా షూటింగ్ సందర్భంగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జాతీయ పార్టీ అయిన బీజేపీ పేరుకు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నా హిందుత్వ నిదానంతో తక్కిన మతాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్ మైనార్టీలకు ఇచ్చే ప్రాధాన్యత హిందువులకు ఇవ్వడం లేదన్న వాదనలు ఉన్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. అయినా ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. నిజానికి నాయకులు ఒక పార్టీని నమ్ముకుని రాజకీయం చేయడం లేదని కేవలం డబ్బు, అధికారం కోసమే పనిచేస్తున్నారని, అలాంటి రాజకీయాలు ప్రజలకు ఏమాత్రం మేలు చేయవన్నారు.
ప్రజలు కూడా తమ నాయకుడిని ఎన్నుకునే విషయంలో తమకు ఏ సమస్య వచ్చినా స్పందించగలిగే నాయకుడి వెంటే నడవాలి తప్ప కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే తాయిలాలు ఆశించి పనిచేయకూడదని, అలాంటి పద్ధతి సరైంది కాదని ఆయన సూచించారు. ముఖ్యంగా తమకు వ్యవసాయ రంగంలో, విద్యారంగంలో, వైద్యరంగంలో మేలు చేయగలిగే శక్తి కలిగిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా వాళ్ళ విషయానికొస్తే వారు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మంత్రులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు రోజాయే తార్కాణం అన్నారు. ఇక ముఖ్యమంత్రి విషయానికొస్తే ప్రజల మంచి కోరి ప్రజల విషయాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన కొనసాగించే వారిని ఆదరించడమే సరైనటువంటి ధర్మం అని ఆయన అన్నారు. నిజానికి పక్ష పార్టీలు విధానమే సరైందని, కానీ వారు కేవలం ప్రజా సమస్యల పోరాటంలోని నిండిపోయారని ఆయన అన్నారు. అందుకే ఓటరుగా నాయకుడిని ఎన్నుకునే సమయంలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు.