కడప జైలులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురిచేయడం వాస్తవమని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపారు. జైలులోని సీసీ ఫుటేజీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కడపలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…, . ”రాజకీయ కుట్రలో భాగంగానే వివేకా హత్య జరిగింది. ఎంపీ టికెట్ కోసమే వివేకాను హతమార్చారు” అని దస్తగిరి మరోమారు స్పష్టం చేశారు.
జైలు అధికారుల తీరుపై సీబీఐని ఆశ్రయిస్తానని దస్తగిరి చెప్పారు. కడప జైలులో ప్రలోభాలపై ఎస్పీ, సీబీఐ ఎస్పీకి లేఖ రాశానని చెప్పారు. జైలులో సీసీ కెమెరాలు పనిచేసేలా చూసే బాధ్యత అధికారులదేనని చెప్పారు. చైతన్య ప్రలోభాలపై మీడియాను ఆశ్రయించాలని తన భార్యకు చెప్పానని అన్నారు. జైలులో జరిగిన విషయాలన్నింటినీ వివరించి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని వివరించారు.. జైలు అధికారులు తనను ప్రలోభాలకు గురిచేసేలా ప్రవర్తించారని ఆరోపించారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని, వివేకాను హత్య చేయించిన వాళ్లే ఇప్పుడు తనపై బురద జల్లుతున్నారు” అని దస్తగిరి చెప్పారు.