Monday, November 18, 2024

Nara Lokesh: ఆ మ‌ర‌ణాలు అన్ని ప్ర‌భుత్వ హ‌త్య‌లే ….నారా లోకేష్…

అమ‌రావతి – బాపట్ల జిల్లా చావలి గ్రామం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి.పూజిత ఆత్మహత్య చేసుకోవడం, విశాఖ జిల్లాలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురికావడం తదితర ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఆర్బీకే నుంచి బలవంతంగా ఎరువులు ఎత్తుకెళ్లారని, బంగారు భవిత ఉన్న పూజితను వైసీపీ నాయకులే బలిగొన్నారని విమర్శించారు.

విశాఖ జిల్లాలో వైసీపీ భూ దందాలకు సహకరించలేదని రమణయ్య అనే తహసీల్దార్‌ను పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు.

- Advertisement -

విజయనగరం జిల్లా రాజాంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ జేఈ వల్లూరు రామకృష్ణను ఏమార్చి వైసీపీ నేతలు సిమెంటు ఎత్తుకెళ్లారని, సిమెంటు లెక్కలు చెప్పాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ వైసీపీ నేతలు బెదిరించారని, దాంతో రామకృష్ణ పంచాయతీ ఆఫీసులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని లోకేశ్ వివరించారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మండిపడ్డారు.

వైసీపీ నేతల అక్రమాలు, వేధింపులు, ఒత్తిళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారని, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అధికారం కోసం సొంత బాబాయ్ ని బలిచ్చిన జగన్ ముఠా తమ అక్రమాలకు సహకరించని ప్రభుత్వం ఉద్యోగులను కూడా అడ్డుతొలగించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. జగన్ ఫ్యాక్షన్ పోకడలను ధైర్యంగా ఎదుర్కోవాలని, టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. అందరూ కలిసి వస్తే వైసీపీ పాలనను అంతమొందించవచ్చు అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement