Tuesday, November 26, 2024

Special Story : జనం నోట ఇదే మాట …. ఈ రెండింటి మధ్యే ఎన్నికల యుద్ధం

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగ బోతున్నాయి. ఇప్పటికే ఆ వాతావరణం కన్పిస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, నిందలు, నిష్టూరాలు.. పరిమితి దాటి పతాకస్థాయికి చేరుతున్నాయి. నిన్న మొన్నటిదాకా విమర్శల్లో వాడిన భాష, ఆరోపణల్లో పసపైనే అందరూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు నేతలతోపాటు ఓటర్లూ రాజకీయాలపై రచ్చబండల్లో చర్చలు మొదలుపెట్టేశారు.

- Advertisement -

ఈసారి ఎన్నికలపై వారు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. వారి దృష్టిలో ఈసారి ఎన్నికలు ఇద్దరి మధ్యే.. రెండు అంశాల మధ్యే. ఒకరు అధికార పార్టీ అధ్య క్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి.. అతడితో తలపడుతున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో వ్యక్తి. ఇక కూటమి పక్షాలు, నేతలు ప్రధాన విపక్ష పార్టీ అస్త్రశస్త్రాలుమాత్రమే.

అలాగే, ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలు.. రెండే. ఒకటి అధికార వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటిని ప్రజలకు చేరవేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ, ప్రజల చెంతకు చేరిన సచివాలయ వ్యవస్థ, సెంటిమెంట్‌… దీనిని ప్రజలు, ఓటర్లు విశ్వసిస్తే వైసీపీదే హవా. వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం. అలాకాక, విధ్వంస పాలకుడు అంటూ జగన్‌పై చేస్తున్న ప్రచారం, అతడి నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలంటూ టీడీపీ కూటమి చేస్తున్న ఆరోపణలు, వారి అభివృద్ధి నినాదం, టీడీపీ అధినేత రాజకీయ, పాలనానుభవం అక్కరకొస్తాయని ప్రజలు అనుకుంటే.. సైకిల్‌దే సవారీ. ఈ రెండు అంశాల్లో… ఈ ఇద్దరు నాయకుల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గితే వారిదే అధికారం. ఈ ఎన్నికల్లో ఆ రెండు అంశాలు, ఆ ఇద్దరు నేతలు మినహా మిగతావేవీ కీలకం కాదు. ఎన్నికలవేళ ఇక నేతలు, పార్టీల టక్కుటమార విద్యలు, గజకర్ణగోకర్ణ మాయలు, తాయిలాలు.. డబ్బు, అభ్యర్థుల ప్రభావం, వ్యూహాలు, సర్వేలు అనేవి తుదితీర్పునకు కారణాలు కానేకావు. ఇదీ సగటు ఆంధ్రుడి అంతరంగం.

రాజకీయాలపై సామాన్యుడి మనసులోని మాట..
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. వరుసగా రెండవసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో ‘మేమంతా సిద్ధం’ అంటూ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో చేజారిన అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ప్రజాగళం’తో ఎన్నికల యుద్ధంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభావాన్ని చవిచూసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. వైసీపీ రికార్డు స్థాయిలో విజయం సాధించింది.

అయితే, గడిచిన ఐదేళ్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశానికి మరింత బలాన్ని అందించేలా పనిచేస్తూ వస్తున్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులను నిరంతరం ఉత్తేజపరుస్తూ వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యుద్ధం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ అంశాలనే గెలుపు మంత్రంగా మలచుకుని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి ఆగిన అభివృద్ధిని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి చూపిస్తానంటూ ఆయన అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల సమరంలో చంద్రబాబు మంత్రం హిట్‌ అయితే మాత్రం టీడీపీకి తిరుగుండదు. రాష్ట్రంలో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని సొంతం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్లెల్లో ఎవరి నోట విన్నా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మరీ.. చంద్రబాబు మంత్రం ఫలిస్తుందో.. లేదో ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి బలమైన శక్తిగా పాతుకుపోయిన వైసీపీని ప్రస్తుత ఎన్నికల్లో ఇంటికి పంపాలన్న పట్టుదలతో చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అయితే సీఎం జగన్‌ మాత్రం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ ఫలా లన్నింటినీ అందిస్తూ వచ్చారు. ప్రత్యేకించి వాలంటీర్‌ వ్యవస్థపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లో తాను నమ్ముకున్న సంక్షేమమే శ్రీరామరక్షగా నిలుస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన బలంగా పదేపదే ఇదే అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. తానెప్పుడు తప్పు చేయ లేదని, ప్రజల కోసం ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకున్నానని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగానే వాలంటీర్‌ వ్యవస్థ, సంక్షేమంపై ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ఈ రెండు అంశాలు పనిచేస్తే మాత్రం మరోసారి జగన్‌ హవానే సాగనుంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ వర్గాల్లో కూడా వాలంటీర్‌ వ్యవస్థ పైనే బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement