ఒకరికి తెలియకుండా మరొకరిని మాటలతో మభ్యపెట్టి పెళ్లి చేసుకోవడం అతనికి అలవాటుగా మారింది. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడో టీడీపీ నేత.. అతని మీద మీడియాలో వచ్చిన కథనాలతో అంతటా ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో అతని మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ విషయంలో ఇప్పటికే రెండో భార్య కూడా కర్నాటకలో అతని మీద కేసు పెట్టింది.
పెద్దతిప్పసముద్రం : ఆంధ్రప్రదేశ్లోని ఓ టీడీపీ నేత ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఆ నిత్య పెళ్లి కొడుకుతో పాటు నలుగురి మీద కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన టీడీపీ లీడర్ దండుపల్లె మంజునాథ్ (32) ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు. అతడి మోసాల గురించి తెలుసుకున్న వారిలో ఇద్దరు భార్యల ఆవేదన మీద ఈ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి. ‘ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లికొడుకు’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీనిమీద స్పందించిన కర్నాట రాస్ట్రం దావణగెరెకు చెందిన మూడో భార్య ఎస్.ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు మంజునాథ్ తో పాటు మూడు పెళ్లిళ్లకు సహకరించిన అత్త, మామ, ఆడపడుచు (వెంకట రమణ, వెంకట్రమణమ్మ, మమత)పై కేసు నమోదు చేశారు.
ఐపీసీ 495, 498ఏ, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్ఐ చెప్పారు. మొన్న రాత్రి 10 గంటల సమయంలో కర్నాటక వాసులు ఆరుగురు వచ్చి నవాబుకోటలో మంజునాథ్ ఇంటి ఎదుట బైఠాయించి గొడవకు దిగారని తనకు ఫోన్ రావడంతో సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టినట్టు ఆయన తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మీద మూడో భార్య ప్రియాంక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయాన్ని కూడా విచారిస్తామని తెలిపారు. తనకు ఇంతకుముందే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తూ రెండో భార్య ఆశ ఈ నెల 11న కర్నాటక చిక్ బళ్లాపురంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడ కూడా కేసు నమోదయ్యిందని చెప్పారు.