Friday, November 22, 2024

ఇదేం తీర్పు.. గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీం అస‌హ‌నం

ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు విష‌యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు సీజే జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.. బెయిల్ ని ర‌ద్దు చేసి..మ‌ళ్లీ ఫ‌లాన రోజున బెయిల్ ఇవ్వాలంటు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడుగా ఉన్నాడు ఎర్ర గంగి రెడ్డి. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది.వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని, సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది.

విచారణ జరిపిన ధర్మాసనం.. ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డికి ఆదేశాలిచ్చింది. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీ లోపు ముగించాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డిని రిమాండ్ కు తరలించాలని సీబీఐ అధికారులకు స్పష్టం చేసింది. జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. ఈ షరతును సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. షరతులతో కూడిన ఉత్తర్వులను హైకోర్టు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement