ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే మరో వైపు రెబల్ ఎమ్మెల అంశం ఆశక్తికరంగా మారింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాల నిమిత్తం గతంలో పలువురు రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు.
అయితే తాజాగా మరోసారి విచారణకు రావాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
ఇదే లాస్ట్ ఛాన్స్ అని.. ఇక ఏ కారణం చేతైనా 19వ తేదీ మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కానీ పక్షంలో ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తుది విచారణకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై సంశయంలో పడ్డ రెబల్స్ ఏం చెయ్యాలి అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో పడ్డారు.