Friday, September 6, 2024

AP | ఇది బడ్జెట్ కాదు.. మ్యానిఫెస్టో : వైఎస్ షర్మిల

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది బడ్జెట్‌ కాదని, మ్యానిఫెస్టో అంటూ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల పట్ల ఆమె తనదైన శై లిలో స్పందించారు. ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు లక్ష కోట్లు అడిగితే ఇచ్చింది రూ.15 వేల కోట్లేనా అని అన్నారు.

పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు. ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్‌ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి. కాని ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు రూ.లక్ష కోట్లు కావాలని అడిగారు.

నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం రూ.లక్ష కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు రూ.5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్‌లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్‌ లైన్‌ అన్నారు.. ఫుడ్‌ సేప్టీ అన్నారు. ఇంత లైఫ్‌ లైన్‌ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

పోలవరం ప్రాజెక్టు కాస్ట్‌ ఎంతో తెలియదు. రూ.12 వేల కోట్లు రీహాబిలిటేషన్‌ కే కావాలి. ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదు? ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్‌ కారిడార్‌కి ఎంత నిధులు ఇస్తారు? రూ.500 కోట్లు ఇస్తారా? రూ.5 వేల కోట్లు ఇస్తారా? బడ్జెట్‌ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఈ బడ్జెట్‌లో కబుర్లు మాత్రమే చెప్పారని విమర్శ చేశారు.

వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్‌ అన్నారు. ఎప్పుడు? ఎంత అనేది క్లారిటీ లేదన్నారు. కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా? ఇది పూర్తిగా బీజేపీ మేనిఫెస్టో. అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది. ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదు. విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు.

- Advertisement -

విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థల స్థాపన కూడా ప్రస్తావన లేదు. కేవలం రూ.15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా? బిహార్‌ 12 మంది ఎంపీలు ఇస్తే రూ.26 వేల కోట్లు ఇచ్చారు.

ఇక్కడ 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీజేపీ మళ్ళీ మోసం చేస్తుంది అని గమనించాలి అని అన్నారు. విశాఖ రైల్వే జొన్‌ ఊసే లేదు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు మాటే లేదన్నారు. ఈ బడ్జెట్‌ హర్షించేది కాదని చంద్రబాబు కళ్ళు తెరిచి బిజెపితో మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

ఇదిలావుండగా వినుకొండ హత్య పొలిటికల్‌ మర్డర్‌ కానప్పుడు డిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ధర్నా చేశాడా? ఇది జాతీయ సమస్య అయినట్లు ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా ఎందుకు చేస్తున్నారు? కడప స్టీల్‌ మీద ఒక్క రోజైనా ధర్నా చేశారా? అంటూ జగన్‌నుద్ధేశించి వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత నారపరెడ్డి కిరణ్‌కుమార్‌, తాంతియాకుమారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement