Tuesday, November 26, 2024

వేస‌వి రాక‌ముందే ప‌ల్లెకు దాహం…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వేసవి ప్రారంభం కాకముందే రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి తరుముకొస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పుష్కలంగా మంచినీరు అందుతున్న ప్పటికీ అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బిందెడు నీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థి తులు కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తడం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆసమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టడం తంతుగా జరుగుతోంది. అయితే, మంచినీటి సమస్యను ఎదుర్కొంటు న్న గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు ప్రతి ఏటా విఫలం అవుతూనే ఉన్నారు. ఫలితంగా మార్చి నెల ప్రారంభమైందంటే చాలు రాష్ర వ్యాప్తంగా వందలాది గ్రామాల్లో మంచినీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కి ఆందోళనకు దిగాల్సి వస్తోంది.

ప్రస్తుత ఏడాది కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే మహిళలు ధర్నాలు, నిరసనలు చేపడుతుండ గా మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటితోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. మరికొన్ని ఊర్లలో అయితే రెండు రోజులకు ఒకసారి సరఫరా అవుతోంది. పట్టణ ప్రాంతాల్లో సైతం మంచినీటి పథకాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, మరికొన్ని పథకాలు అటకెక్కినా వాటిని దీర్ఘకాలంగా మరమ్మతులు చేయించకపోవడంతో వేసవి వచ్చిందంటేనే పట్టణ ప్రజలు కూడా మంచినీటికోసం కటకటలాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి తాగు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సుజల స్రవంతి పథకం ద్వారా నాణ్యమైన నీటిని అందించేలా ఏర్పాట్లు చేసింది. అందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తోంది. వేసవికి ముందే మంచినీటి సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పదేపదే ఉన్నతాధికారులు ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు సూచిస్తున్నారు. సీఎం జగన్‌ సైతం సమీక్షల్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా కొంత మంది అధికారులు ఆదిశగా దృష్టిసారించడం లేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మంచినీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చబోతోంది.

అక్కడ నేటికీ.. చలమల నీరే ఆధారం :
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో తీర ప్రాంత గ్రామాలు గొంతు ఎండుతున్నాయి. ప్రతి ఏటా తీర ప్రాంత ప్రజలు ఇదే సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. బిందెడు నీళ్ల కోసం నేటికీ సముద్రం ఒడ్డున చలమల్లోని కలుషిత నీటిపై ఆధారపడుతున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామంలోని కొళాయిలు ఉన్న రెండేళ్లుగా నీరు అందించే పరిస్థితి లేదు. దీనిపై అధికారులు దృష్టి సారించిన దాఖలాలు లేవు. గ్రామానికి సరఫరా అవుతున్న సుజల స్రవంతి నీరు ఎటూ చాలకపోవడం, ఆ నీటి కోసం అందరూ ఎగబడడంతో అవస్థలు తప్పడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ. 20 వెచ్చించి శుద్ధ జలాలు కొనుగోలు చేస్తుంటే ఆ పరిస్థితి లేని వారు సముద్రం ఒడ్డున గల చలమల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. బూర్జపాడు పంచాయతీలోని డొంకూరు, చిన్న లక్ష్మీపురం, పెద్ద లక్ష్మీపురం, శివ కృష్ణాపురం గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు మండపల్లి, బుడ్డెపు పేట, బాలకృష్ణాపురం, బిర్లంగి, ముచ్చింద్ర గ్రామాల్లోని దాహం కేకలు మిన్నంటు-తున్నాయి.

అనంతలో.. ట్యాంకర్ల నీరే దిక్కు
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తాగు నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలోనూ వాటిని ఆచరణలో అమలు పర్చడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. దీంతో వేసవి వచ్చిందంటే ట్యాంకర్లపైనే మంచినీటికోసం ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో రవాణా చేసిన నీటి బిల్లులకు సంబంధించి అనంతపురంలో రూ. 67 కోట్లు రావాల్సి ఉండగా, 50 కోట్లు- విడుదల చేశారు. ఇదే విధంగా సత్యసాయి జిల్లాలో రూ. 27 కోట్ల దాకా బిల్లులను బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే, పాత బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో మంచినీటి సమస్య ప్రారంభం కానప్పటికీ రానున్న రెండుమూడు నెలల్లో తాగు నీటికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఆపరిస్తితి ఎదురైతే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా మందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయా ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ప్రకాశంలో.. మొదలైన ఆందోళనలు
సాగు నీరు, తాగు నీరు కోసం ప్రతి ఏటా ఇబ్బందులు ఎదుర్కొనే జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఎప్పుడూ ముందుంటుంది. అటువంటి జిల్లాలో ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో వేసవి వచ్చిందంటే చాలు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సి వస్తోంది. ప్రస్తుత ఏడాది మార్చి ప్రారంభమైందో లేదో అప్పుడే రెండు ప్రాంతాల్లో మహిళలు మంచినీటికోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే గత ఏడాదితో పోలిస్తే పలు మండలాల్లో క్రమంగా భూగర్భ జలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. పట్టణాలు, 400కు పైగా గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. అలాగే 200 ఆవాస ప్రాంతాల్లో 350 ట్యాంకర్ల ద్వారా రోజుకు 3వేల ట్రిప్పుల వరకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఏ ధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాల్లో సాధారణంగా వేస కాలంలో నీటి ఎద్దడి నెలకొనడం సహజం. కానీ ఈ ఏడాది వేస కి ముందే ఫిబ్రవరి నెలలోనే తాగునీటి సమస్య నెలకొంది. రోజు రోజుకూ అధికమవుతున్నాయి. ఏడాదిగా నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రధాన నీటి వనరుగా ఉన్న సాగర్‌ నీటి సరఫరా, తాగునీటి పథకాల నిర్వహణ లోపంతో ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. జిల్లాల్లో పిడబ్యుయస్‌ పథకాలు 815 ఉండగా, అందులో 66 పథకాలు ఎండిపోయాయి. అలాగే యంపీడబ్ల్యు ఎస్‌ పథకాలు 939 ఉండగా, 124 ఎండిపోయాయి. అంతే కాదు డైరెక్ట్‌ పంపింగ్‌ పథకాలు 1104 ఉంటే అందులో 125 వనరులు ఎండిపోయాయి. చేతిపంపులు జిల్లా వ్యాప్తంగా 17692 ఉండగా, 2518 ఎండిపోయాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్‌, మే నెలలో పరిస్థితి ఏ ధంగా ఉంటు-ందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

తడారుతున్న కృష్ణా ప్రజల గొంతుక
రాజకీయ రాజధాని అయిన కృష్ణా జిల్లాలోనూ మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా పరిధిలో కృష్ణా నది ఉన్నప్పటికీ అనేక పల్లెల్లో తాగు నీటి సమస్య విలయతాండవం చేయబోతోంది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పల్లెపాలెం గ్రామం ఉప్పుటేరుని ఆనుకుని ఉటుంది. ఈ గ్రామానికి గత సంవత్సర కాలంగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. మెగా నీటి పథకం నుంచి రావలసిన త్రాగునీటి పైపులైను మరమ్మతులు కారణంగా ఈ గ్రామానికి త్రాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పైపులైనుపై ఇటీ-వల 216 జాతీయ రహదారిని నిర్లక్ష్యంగా నిర్మించడం వలన త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టు-కున్నా ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం, ఇరాలి, ఉటగుండం, బసవానిపాలెం గ్రామాలలో గత రెండు వారాలుగా ఇంటింటికి కుళాయిల ద్వారా వస్తున్న మంచినీరు శుద్ధి చేయకుండా పంపిస్తున్నారని గ్రామాలలో కుళాయిలు వదిలే వారికి, అధికారులకు తమ సమస్యలు తెలిసిన పట్టించుకోవడంలేదని దిగువ ప్రాంత గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

మందుచూపు లేకపోతే మరింత ప్రమాదం
రాష్ట్రంలో ప్రధాన జలాశయాలతోపాటు ఆయా ప్రాంతాల్లోని సాగు నీటి వనరుల్లో సాధారణ నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. అయితే మార్చి చివరి నాటికి ఆ నిల్వలు మరింత తగ్గుముఖం పట్టి భూగర్భ నీటి మట్టాలు ప్రమాదస్థాయికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో మంచినీటి సమస్య ఉన్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తాగు నీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఇప్పటి నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. అవసరమైన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాలి. లేదంటే వేసవిలో వందలాది గ్రామాలు మంచినీటికోసం విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement