Wednesday, December 11, 2024

AP | క్రియేటివ్ గా ఆలోచించండి.. విద్యార్థుల‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్

  • స్వశక్తితో చదవండి
  • ఉన్నత శిఖరాలకు ఎదగండి
  • లింగ వివక్ష వద్దు
  • మీ సమస్యల్ని పరిష్కరిస్తా
  • కడప విద్యార్థులకు డిప్యూటీ సీఎం హామీ

( ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో) : ప్రతి ఒక్కరూ క్రియేటివ్ గా ఆలోచించాలని, స్వశక్తితో ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఉద్బోధ చేశారు. ‘రాయలసీమ అంటే చదువుల నేల. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి. ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు. అలాంటి రాయలసీమకు పునర్ వైభవం రావాలి’ అని అన్నారు. 2014.. -19 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ఇక సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అయితే, కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సృజనాత్మకతను ప్రసంసించారు.

వెనుకపడిన సెక్షన్ విద్యార్థులతో మాటామంతీ పంచుకున్నారు. కడప మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ లో శనివారం పేరేంట్స్ టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలోకి ప్రవేశించగానే పదవ తరగతి విద్యార్థులు తయారు చేసిన రైల్వే రోప్ ఎలివేటర్ ప్రాజెక్ట్ ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ.. ప్రతి ఒక్కరూ సృజనాత్మకతతో ఆలోచించాలని సూచించారు. అనంతరం తరగతి గదిలో ప్రతి విద్యార్థిని పలకరించి విద్యార్థుల ప్రావీణ్యతను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ లో ఉన్న డిజిటల్ బోర్డును పరిశీలించారు. ప్రధానంగా రెజ్లింగ్, ఆర్చరీ, క్రికెట్ వంటి క్రీడల్లో రాష్ట్ర స్థాయి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను అభినందించారు.

ఆటలకు సదుపాయాల్లేవు : విద్యార్థుల నిస్పృహ
ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ప్రాక్టీస్ చేసుకునేందుకు సరైన క్రీడా పరికరాలు, వసతులు లేవని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బాలికలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. శిక్షణ క్యాంపులు కూడా నిర్వహించడం లేదన్నారు. దీనిపై స్పందించిన పవన్ ఎందుకలా జరుగుతోంది ?, బాలురు, బాలికలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి కదా? అంటూ ప్రశ్నించారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అందరూ బాగా చదవాలని స్వసక్తితో ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

- Advertisement -

ప్రతి విద్యార్థికి ఆత్మీయ పలకరింపు….
అనంతరం పింగళి వెంకయ్య బ్లాక్ 8వ తరగతి డి సెక్షన్ నందు విద్యార్థులతో మాట్లాడారు. అక్కడి నుంచి మహాత్మా గాంధీ బ్లాకు ఆరవ తరగతి సి సెక్షన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా విద్యార్థుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కరచాలనం చేశారు. చంద్రిక అనే విద్యార్థి వేసిన పవన్ కళ్యాణ్ పెన్సిల్ ఆర్ట్ ను ఆయనకు అందజేయగా, దానిపై సంతకం చేసి విద్యార్థికి ఇచ్చారు.

అయితే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం పవన్ ను చూసిన ఉత్సాహంతో ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు. అదేవిధంగా తరగతి గది బయట నుంచి జై పవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, కేకలు వినిపించడంతో ఆయన తరగతి గదిలో కూర్చోలేక బయటకు వెళ్లారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులు వేసిన రంగోలి ముగ్గులను ఆయన పరిశీలించి వారితో సెల్ఫీలు దిగారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డు నందు సంతకం చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించండి.. డిప్యూటీ సీఎంకు వినతి…
20 ఏళ్లుగా పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్, మండల్ ఇన్ఫర్మేషన్ సిస్టం కోఆర్డినేటర్ లుగా పనిచేస్తున్నామని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సీఎం పవన్ కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన పవన్ పరిశీలిస్తామని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన డ్రగ్స్ రహిత సమాజం కోసం అనే వాల్ పోస్టర్లను పవన్ ఆవిష్కరించారు.

ఉప ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం !
మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్ లో పాల్గొనేందుకు కడపకు వచ్చిన డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. శనివారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన ఉదయం 11.00 గంటలకు కడప విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement