Wednesday, December 18, 2024

AP | తీగ ఇక్క‌డ‌.. డొంక గుజ‌రాత్ లో.. ఎస్పీ సుబ్బారాయుడు

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో అన్నమయ్య జిల్లాలో దొరికిన ఇద్దరి ద్వారా గుజరాత్ లో ఉన్న ముగ్గురు స్మగ్లర్ల గుట్టు బయటపడిందని ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఇన్ ఛార్జ్ గా ఉన్న తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారాయుడు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సంబంధిత వివరాలను వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం.. ఇటీవల టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు ఎర్రచందనం అక్రమ రవాణా దారులు పట్టుబడ్డారు. వారి ద్వారా లభించిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ షరీఫ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని గుజరాత్ కు పంపించారు. అక్కడి పోలీసుల సహకారంతో గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా దీశా పట్టణానికి చెందిన ఉత్తమకుమార్ నందికిషోర్ సోని అలియాస్ సోని అనే వ్యక్తిని, అతని స్నేహితులు జోష్ హన్స్ రాజ్, విర్దాయ్ అలియాస్ జోషి హన్స్ రాజ్ ను, పటాన్ పట్టణానికి చెందిన పరేష్ జి కాంతిజీ ఠాకూర్ అలియార్ ఠాకూర్ పేరేష్ జీ లను ఎర్రచందనం స్మగ్లింగ్ నేరం కింద అరెస్టు చేశారు. 

- Advertisement -

ఆ సందర్భంగానే పటాన్ లోని ఒక గోడౌన్ లో ఉన్న దాదాపు 5టన్నుల బరువైన రూ.3.50కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను, ఒక బ్రేజా కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అక్కడి కోర్టులో ప్రవేశ పెట్టి పీటీ వారంట్ తో తిరుపతికి తీసుకువచ్చారు. ఇంకా ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోడానికి దర్యాప్తు కొనసాగుతోందని, అరెస్ట్ అయిన ముగ్గురిపై అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఎంత పెద్ద వారున్నా వదిలే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ఈ కేసు పరిశోధనలో పాల్గొన్న బృందం సభ్యులను అభినందించిన సుబ్బారాయుడు వారికి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు బాలిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, షరీఫ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement