తిరుపతి, నవంబర్ 5( ప్రభ న్యూస్ ప్రతినిధి):
గోల్డ్ లోన్స్ మేనేజర్ కారులో రూ.40లక్షల విలువ చేసే బంగారాన్ని సినీ ఫక్కీలో దొంగలు దోచుకెళ్లారు.చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. రూ.40 లక్షల రూపాయల విలువచేసే బంగారం క్షణాల్లోనే మాయమవడం కలకలం రేపింది. చిత్తూరులోని కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీలో చుట్టు పక్కల చాలా మంది బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. రోజు వారిలాగే యధావిధిగా తాకట్టు పెట్టిన ఆ బంగారాన్ని తీసుకుని మేనేజర్ జాన్‌బాబు బయలుదేరాడు.
చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ దగ్గర ఆగాడు. కారు పక్కకు ఆపి హోటల్ గదిలోకి వెళ్లాడు. అప్పటికే మేనేజర్ జాన్ బాబును ఫాలో అవుతున్న దొంగలు హోటల్ వద్ద ఉన్న మేనేజర్ కారు దగ్గర చేరుకున్నారు. జాన్ బాబు కారులో ఉన్న బంగారాన్ని చాకచక్యంగా దోచేసిన అక్కడి నుంచి పారిపోయారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 మంది పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇది ఇంటి దొంగల పనేనా, లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేస్తోంది. బ్రాంచ్‌లో ఉండాల్సిన బంగారాన్ని మేనేజర్ ఎందుకు తీసుకెళ్లినట్టు. విలువైన బంగారమును కారులో వదిలేసి ఆ హోటల్లోకే ఎందుకు వెళ్లినట్టు అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కారులో బంగారం ఉన్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది పెద్ద అనుమానం. చోరీ జరిగిన తీరు చూస్తుంటే ఇంటి దొంగల పనే అనే అనుమానం వస్తోంది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు చుట్టుపక్కల గతంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాలపై దృష్టి సారించిన పోలీసు అధికారులు, అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు.