తిరుపతి నగరంలో ఇంటి దొంగతనాలు చేస్తున్నటువంటి దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే 380 గ్రాముల బంగారు నగలు, 294 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సుప్రజ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… తిరుపతి నగరంలో పలు దొంగతనాలు చేసిన కరుడుగట్టిన దొంగను అలిపిరి పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలోని జీవకోన నవజీవన్ కాలనీకి చెందిన వరద రాజులు మనీ (27)ను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. ఇతను ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ముద్దాయి పన్నెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇతను అలిపిరి ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఇతను ముందుగా తాళం వేసిన ఇళ్ల కోసం రెక్కి నిర్వహించి, అతను చేతికి గ్లౌజులు ధరించి తనకున్న పరిజ్ఞానంతో ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడే వాడన్నారు. దొంగతనాలు చేసినటువంటి నగదును జల్సాల కోసం చెన్నైలో అమ్మాలనే ఉద్దేశంతో ఆ నగలన్నీ ఎవరికి అనుమానం రాకుండా బ్యాగులు తీసుకుని వెళుతుండగా చెన్నైకి వెళ్లే బస్సు కోసం ఆటో నగర్ బస్ స్టాప్ వద్ద వేచి ఉండగా అతన్ని అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ అరెస్టు చేసి, అతని వద్ద సొత్తును రికవరీ చేయడం జరిగిందన్నారు. నగరంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న దొంగతనాలు గురించి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును చేధించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని తెలియజేశారు. అతన్ని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన అలిపిరి ఎస్ఐలు మోహన్ కుమార్ గౌడ్, ఇమ్రాన్, పరమేష్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ రవి రెడ్డి, రవి ప్రకాష్ కానిస్టేబుళ్లు ప్రసాద్, రాజశేఖర్, షణ్ముఖ రావులను ఎస్పీ వెంకటప్ప నాయుడు అభినందించి, రివార్డును ప్రకటించారు.