స్కూల్ విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం నారా లోకేష్ దాదాపు 3గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సంర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల బదిలీ పారదర్శకంగా జరగాలని… ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో లాగ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, విధివిధానాలని రూపొందించాలని కమిషనర్ ను మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీచర్లకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి..
మూసివేసిన పాఠశాలల పూర్తి వివరాలను తదుపరి సమీక్షలో సమర్పించాలని. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమో వాటిని సమకూర్చుకోవాలి అని అన్నారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రయివేటు పాఠశాలలకు విద్యార్థుల బదిలీలకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలి. దీంతో పాటు పిల్లల అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో లోకేష్ చర్చించారు.
అత్తుత్తమ విధానాలపై అధ్యయనం చేసి నివేదిక అందించండి..
దేశంలో అత్తుత్తమ విద్యా విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి లోకేష్ కోరారు. సమీక్షలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థల గురించి తెలుసుకోవాలని నారా లోకేష్ ప్రస్తావించారు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై ఫోకస్ చేయాలని, ఏ ప్రాంతంలో పాఠశాలల కొరత ఉందో చూసి, నూతన పాఠశాలలు ప్రారంభించాలనేది రిపోర్ట్ చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.