ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైయస్‌జగన్ సమీక్ష చేపట్టారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎంకు వివరించారు వివిధ శాఖలకు చెందిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు.
గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి సాధించింది. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అధికారులు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగు పరుచుకుంటున్నామని అధికారులు తెలిపారు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం జగన్ అన్నారు.