ఎరువుల కొరత పేరుతో బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై వ్యవసాయశాఖ నిఘా పెట్టింది. ముగింపు దశకు చేరిన రబీసీజన్‌లో డిమాండ్‌కు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు ఉన్నా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించటం.. రైతులకు అత్యవసరమైన ఎరువులను అసలే విక్రయించకుండా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై వ్యవసాయశాఖ నిఘా విభాగం దృష్టి సారించింది. జిల్లాల వారీగా అవసరాలు, నిల్వల ఆధారంగా బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలను కట్టడి చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై రైతులతో పాటు- ఎవరైనా నిర్దిష్ట సమాచారంతో ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరు 155251 ఏర్పాటు చేసింది. వ్యవసాయశాఖ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్రస్థాయికి సిబ్బంది వెళ్ళేలా అప్రమత్తం చేశారు. ఏపీ మార్క్ ఫెడ్, సహకార సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ఎరువులను రైతులకు సరఫరా చేస్తుండగా గుర్తింపు పొందిన రిటైల్, హోల్ సేల్ డీలర్ల వద్ద నుంచి కూడా రైతులు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్, సప్లయ్ లను వ్యవసాయశాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రబీ పంటలకు అవసరమైన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ వెల్ల డించింది. రబీలో పంటలు, విస్తీర్ణం అంచనాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం.. కొన్ని జిల్లాల్లో యూరియా కొరత ఉన్నట్టు కొనసాగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదు.. కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. యూరియాతో పాటు ఎరువుల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబరు 155251 నంబరుకు ఫోన్ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
రబీ కోసం 23.45 లక్షల టన్నుల ఎరువులు..
రబీ సీజన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 23.45 లక్షల టన్నుల ఎరువులు, 9 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని వ్యవసాయశాఖ అంచనా. రబీ సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో తాజా లెక్కల ప్రకారం సహకార సొసైటీలు, రైతు భరోసా కేంద్రాలతో పాటు రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 1.74 లక్షల టన్నుల యూరియాతో పాటు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జనవరిలో 49,736 మెట్రిక్ టన్నులు, ఈ నెలలో ఇప్పటివరకు 20.500 మెట్రిక్ టన్నుల యూరియా, ఈనెల 6 వరకు 12.69 లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రాన్రికి పంపించింది. ఉభయగోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉండటంతో అందుబాటులో ఉన్న నిల్వలను ఆ ప్రాంతాలకు వేగంగా చేరవేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. గడిచినవారం రోజులుగా గుంటూరుకు 19,250 మెట్రిక్ టన్నులు, నెల్లూరు జిల్లాకు 12,800 మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరికి 17,230, పశ్చిమ గోదావరికి 18వేలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు 14 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..