Sunday, November 17, 2024

పొగాకు సాగు తగ్గేదే లేదు.. లక్ష్యానికి మించి పెరగనున్న విస్తీర్ణం, దిగుబడి

అమరావతి, ఆంధ్రప్రభ : మాండూస్‌ తుపాను ధాటికి పంట దెబ్బతిని పూర్తిగా ప్రతికూల వాతావరణం ఏర్పడినా పొగాకు సాగు విస్తీర్ణం,దిగుబడి ఈ ఏడాది లక్ష్యానికి మించి పెరిగే అవకాశం ఉందని పొగాకు బోర్డు భావిస్తోంది. కర్ణాటకలో పొగాకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టటం, ఆ మేరకు ఉత్పత్తి కూడా తగ్గటంతో ఈ ఏడాది మార్కెట్‌ ఆశాజనకంగా ఉంటుందన్న ప్రగాఢమైన నమ్మకంతో పొగాకు సాగు విస్తీర్ణాన్ని పెంపుదల చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి గాను పొగాకు బోర్డు 142 మిలియన్‌ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రకటించగా 150 మిలియన్‌ కిలోలు దిగుబడి రావచ్చని అంచనా. గత ఏడాది 43 వేల మంది రైతులు 66 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేసి 121 మిలియన్‌ కిలోల పొగాకును పండించగా.. ఈ ఏడాది డిసెంబరు నాటికే సుమారు 54 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇపుడిపుడే నాట్లు పడుతుతున్నాయి.

ఈ ఏడాది 72 నుంచి 75 వేల హెక్టార్లకు పొగాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా. మాండూస్‌ తుపాను వల్ల సుమారు 30 వేల హెక్టార్లలో కొన్ని చోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా పంట దెబ్బతినగా.. రైతులు మళ్ళీ ఆ పొలాల్లో సాగుకు ఉపక్రమించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ పొగాకు సాగు చేస్తున్నా దక్షిణాది నల్లరేగడి నేలలు (ఎస్‌.బి.ఎస్‌), దక్షిణాది తేలికపాటి నేలలు (ఎస్‌ఎల్‌ఎస్‌) పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాల పరిధిలోనే అత్యధికంగా పొగాకు పండిస్తున్నారు.

- Advertisement -

కర్ణాటకలో ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం, దిగుబడి భారీగా తగ్గిపోవటమే దీనికి ప్రధాన కారణం. కర్ణాటకలో సుమారు 100 మిలియన్‌ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రకటించగా 60 నుంచి 65 మిలియన్‌ కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అందులోనూ నాణ్యత ఉన్న పొగాకు పరిమాణం తక్కువగా ఉండటంతో ట్రేడర్లంతా ఏపీ వైపు దృష్టి సారించినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పొగాకు సాగు విస్తీర్ణం పెంచుతూ అధిక దిగుబడి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది పొగాకు కిలో సగటు ధర రూ.239.16 వద్ద నిలిచింది. ఈ ఏడాది రూ 260 నుంచి రూ 270 మధ్య స్థిరపడవచ్చని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి పొగాకు వేలం ప్రారంభయ్యే అవకాశం ఉంది.

మార్క్‌ఫెడ్‌ తో రైతులకు లాభాలు

పొగాకు మార్కెట్‌ లో ఎన్నడూ ప్రవేశించని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ మార్క్‌ ఫెడ్‌ ధరల్లేక రైతులు సంక్షౌభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రెండేళ్ళ క్రితం ఆదుకుంది. ఆ పొగాకును గత ఏడాది విదేశాలకు ఎగుమతి చేసింది. 2020 సీజన్‌ లో వేలం కేంద్రాల్లో గిట్టు బాటు ధరలు రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ను రంగంలోకి దించి సుమారు 108 కోట్ల విలువైన 13 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేయించింది. దానిలో మూడొంతుల పొగాకును దేశీయ మార్కెట్లో విక్రయించగా మిగిలిన పొగాకును ప్రాసెసింగ్‌ చేసి అమెరికాకు ఎగుమతి చేశారు. విదేశాలకు పొగాకును ఎగుమతి చేసేందుకు ప్రత్యేకంగా ఎక్స్‌పోర్ట్‌ ఏజెన్సీ ని కూడా నియమించారు.

ఆరు కంటైనర్లలో చెన్నై పోర్టు నుంచి అమెరికాకు 120 టన్ను పొగాకును ఎగుమతి చేసినట్టు మార్క్‌ఫెడ్‌ గత ఏడాది ప్రకటించింది. దీంతో పొగాకు మార్కెట్‌ లో మూడవ అతి పెద్ద కొనుగోలు సంస్థగా ఏపీ మార్క్‌ఫెడ్‌ అవతరించినట్టయింది. కేవలం సంక్షౌభ సమయంలోనే కాకుండా అన్ని సీజన్లలో మార్క్‌ఫెడ్‌ ను కూడా రంగంలోకి దించితే ట్రేడర్ల మధ్య పోటీ ఏర్పడి గిట్టు బాటు ధరలు లభిస్తాయనీ, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరగటంతో పొగాకు సగటు ధర కిలోకు కనిష్టంగా రూ.175 నుంచి రూ.200 ఉంటే తప్ప గిట్టు బాటు కాదని రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement