Tuesday, November 26, 2024

Delhi: అసెంబ్లీ సీట్ల పెంపు లేదు, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే.. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు ముద్రించేవరకు ఎదురుచూడక తప్పదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి తెలిపారు.

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కలను ప్రచురించే వరకు దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలంటే, అందుకు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాలని, అప్పటి వరకు సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

కేంద్ర మంత్రి సమాధానాన్ని విశ్లేషిస్తే.. లోక్‌సభతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచుతూ చేపట్టే భారీ కసరత్తులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి తప్ప, విడిగా పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టయింది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల కోసం రాజ్యాంగ సవరణ చేపట్టి మరీ సీట్ల సంఖ్యను పెంచే సాహసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసే అవకాశాలు లేనే లేవు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోనే అనేక రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సిందిగా చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నాయి. ఒకవేళ తెలుగు రాష్ట్రాల కోసం రాజ్యాంగ సవరణ చేపడితే, మిగతా రాష్ట్రాలు సైతం పనిలో పనిగా తమ రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి.

అందుకే.. దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెంపు కోసం చేపట్టే కసరత్తులో భాగంగానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల సీట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు ముద్రించే వరకు అంటే, 2032 తర్వాతనే ఈ కసరత్తు మొదలవుతుంది. సీట్ల సంఖ్య పెంచిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఆ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తిచేయడానికి మరికొంత సమయం పడుతుంది. అంతా అనుకున్నట్టు సాగితే 2034 సార్వత్రిక ఎన్నికల సమయానికిగానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు లేవు. ఇంకా చెప్పాలంటే 2021 జనాభా లెక్కల సేకరణ ఆలస్యమైన నేపథ్యంలో ఆ తదుపరి జరగబోయే జనాభా లెక్కలు కూడా ఆలస్యమైతే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement