Friday, November 22, 2024

AP | దుర్గగుడి అభివృద్ధిపై రాజీ పడేది లేదు..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : దుర్గగుడి అభివృద్ధిపై ఎక్కడా, ఎప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నగరంలోని బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో ట్రస్ట్ బోర్డ్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు పాలకమండలి సమావేశంలో చర్చించిన ఆమోదించిన అంశాలను వివరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ భక్తులకి మరింత సౌకర్యంగా ఉండే ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు.

కొండపైన పూజా మండపం నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపిందని, ఫిబ్రవరి 18 నుంచి మల్లేశ్వరస్వామి ఆలయ దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. మల్లేశ్వరస్వామి ఆలయానికి లైటింగ్ ఏర్పాటుకు ఆమోదం చెప్పామన్నారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్ లోని నిర్మాణాలకు ఒక రూపంతెస్తామ‌న్నారు. దుర్గగుడి అభివృద్ధి పై రాజీపడేదని.. నివేదన సమయంలో వచ్చే వివిఐపీ భక్తులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులపై చర్చించాం అని చెప్పారు.

ఇక పై ప్రతీ రోజూ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ వివిఐపీ భక్తులు , వృద్ధులు, వికలాంగులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తామని… త్వరలో గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ లో రెండు షిఫ్ట్ లలో దుర్గగుడి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో టెక్నికల్ కమిటీకి సూచనల మేరకు మరమ్మత్తులు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, దేవిశెట్టి బాలకృష్ణ, బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి, అనుమోలు ఉదయలక్ష్మి, కొలుకులూరి రామసీత గార్లు, ప్రత్యేక ఆహ్వానితులు జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చెన్నా జనార్దన్ రావు, కోసూరి వెంకట రాజు, మార్నెడి రాఘవ రాగిణి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement