విజయనగరం : చంద్రబాబుపై చాలా కేసులున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ…. స్టేలు తెచ్చుకొని ఇంతవరకు నెట్టుకొచ్చారని, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పించుకోలేకపోయారన్నారు. తప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరన్నారు. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకోలేరన్నారు. శాసనసభలో అనవసరంగా అల్లరి చేశారన్నారు. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని అన్నారు.
పార్టీనే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వైసీపీ కార్యకర్తలపై ఉందన్నారు. దొంగతనం చేసి, దొరికిపోయి జైల్లో పెడితే… ప్రజల్లో సానుభూతి వస్తుందా అని అన్నారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, అందులో రాజీ లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన స్కీమ్ ను తీసుకొచ్చామన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో సంక్షేమాన్ని అందిస్తోన్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు.
ఎమ్మెల్యేలకు బొత్స చురకలు :
నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కొరవడిందని మంత్రి బొత్స ఎమ్మెల్యేలకు చురకలంటించారు. కొందరు ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా వ్యవవహరిస్తున్నారన్నారు. సమస్య వచ్చినప్పుడు ఒక పక్కే చూస్తున్నారన్నారు. అందరినీ సమదృష్టిలో పెట్టుకొని, సమస్యను పరిష్కరించాలన్నారు. ఎంపీపీలు కూడా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమన్నారు.