అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆడిట్ ఉద్యోగుల సాధారణ బదిలీలు జరగవంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. కొందరు పనిగట్టుకొని తమ సంఘం ఆపిందంటూ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, జీ.ఆస్కారరావు తెలిపారు. తమ సంఘం ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ తరహా ప్రచారం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారొక ప్రకటన చేస్తూ జిల్లాల పునర్విభజన నేపధ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఇతర శాఖల్లో మాదిరి ఆడిట్ శాఖలో జరగలేదని వారు తెలిపారు.
ఆ కేటాయింపులు తప్పనిసరిగా చేయాల్సి ఉందని చెపుతూ ఈ క్రమంలోనే ప్రభుత్వం సాధారణ బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాల పునర్విభజన ఉత్తర్వులు 31,41లో నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉందని, జీవోలు 116, 117, 122లో నిర్థేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బదిలీలు విడివిడిగా జరిపిన పక్షంలో కొందరు ఉద్యోగులకు వెంట వెంటనే రెండుసార్లు స్థాన చలనం పొంది ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ రెండు ప్రక్రియలను కలిపి ఒకేసారి బదిలీలు నిర్వహించాలని మాత్రమే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరిందని వారు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొంటూ ఈ క్రమంలోనే పలువురు తమ సంఘంపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు.
దీనిపై బుధవారం మరోసారి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను కలిసి ఆడిట్ విభాగం రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో తమ సంఘం అభిప్రాయాన్ని స్పష్టం చేశామని తెలిపారు. ఆడిట్ విభాగంలో ఉద్యోగుల సాధారణ బదిలీలు జరగవనే అపొహలు నెలకొనడంపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా గడువు ముగిసిన తర్వాత కూడా రెండు ప్రక్రియలను కలిపి బదిలీలు నిర్వహిస్తామనే హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఆడిట్ ఉద్యోగులు అపోహలను నమ్మొద్దని పేర్కొంటూ ఖచ్చితంగా సాధారణ బదిలీలు జరుగుతాయని, దానికి తమ సంఘం బాధ్యత తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు.