( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : అప్పుడు కర్మభూమిలో సేవ చేసే అవకాశం లభిస్తే, ఇప్పుడు జన్మభూమిలో సేవ చేసుకునే అదృష్టం దక్కిందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మాజీ కేంద్రమంత్రి యలమంచిలి సత్యనారాయణ(సుజనా)చౌదరి తెలిపారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడైనా ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయడంలో సుజనా ఫౌండేషన్ ముందు ఉంటుందని తెలిపారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
విజయవాడలోని విద్యాధారపురంలో ఉన్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రతిరోజు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి సారిగా కళాశాల విద్యార్థులకు బోజన పధకం ప్రవేశ పెట్టిన సుజనా చౌదరి శనివారం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో విద్యాన్నపూర్ణ పేరిట భోజన పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాట్లు తెలిపారు. ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నికల సమయంలో సమస్యలు గుర్తించినట్లు చెప్పినా ఆయన గతంలో కాలేజీలో పిట్టగోడలు ఉండేవని, విద్యార్థులు పడిపోతారేమోనని భయం తనకు వేసిందన్నారు. వెంటనే సుజనా ఫౌండేషన్ ద్వారా పిట్టగోడలు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
అలాగే భోజన పథకం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం గాంధీజీ మున్సిపల్ స్కూల్ లో సాయంత్రం విద్యార్థులకు సొంత నిధులతో స్నాక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలో, కళాశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువుగా చదువుకుంటారని, వారికి అవసరమైన సహాయ సహకారాలు తాను ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో కర్మభూమిలో పనిచేసినట్లు చెప్పిన ఆయన ఇపుడు జన్మభూమిలో సేవ చేసుకునే అదృష్టం దక్కిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరినుంచి బెస్ట్ గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. దుర్గగుడి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ఆయన ప్రణాళిక బద్ధంగా ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. పేరెంట్ అండ్ టీచర్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, ప్రజలకు మేలు చేయడం,సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.