ముప్పాళ్ల, (ప్రభ న్యూస్): గుంటూరు జిల్లాలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. సచివాలయంలోకి ఫుల్గా తాగివచ్చి రచ్చ రచ్చ చేశాడు. ముప్పాళ్ల మండల కేంద్రంలో ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) జరిగింది. ముప్పాళ్ల గ్రామ సచివాలయంలో పీకల దాక మద్యం తాగి వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పంచాయతీ వార్డ్ మెంబర్ కుమారుడు తలకొల కోటిరెడ్డి మద్యం మత్తులో సచివాలయానికి వచ్చాడు. తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని సిబ్బంది పై దౌర్జన్యం చేశాడు. అంతటితో ఆగక సచివాలయంలో ఉన్న రెండు కంప్యూటర్లు, ప్రింటర్ ను ధ్వంసం చేశాడు.
అంతేకాకుండా తానే పోలీసు స్టేషన్ కు వెళ్లి సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదు చేసేందుకు యత్నించ్చాడు. అక్కడ కూడా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. దీనిని నిలువరించేందుకు యత్నించిన మహిళ కానిస్టేబుల్ పై కూడా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ తీసుకునేందుకు ఆమెతో పెనుగులాడాడు. ప్రతిఘటించిన మహిళా కానిస్టేబుల్ ను కోటిరెడ్డి బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటన గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరావుతో చర్చించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపారు.