Saturday, November 23, 2024

ఇక వైసీపీ ఖేల్ ఖతం, వచ్చేది వన్‌సైడ్‌ ఎలక్షనే.. గ్రూపులు కడితే ఊరుకోనన్న చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి జగన్‌ అసమర్ధ, అధ్వాన పాలనతో వైకాపా పని అయిపోయిందని, ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వన్‌సైడ్‌ వారేనని అన్నారు. మంగళవారం సభ్యత్వ నమోదు, మహానాడు సక్సెస్‌, జిల్లాల పర్యటన, పార్టీ కమిటీల నియామకాలు, న్యూట్రిఫుల్‌ యాప్‌ తదితర అంశాలపై నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మహానాడు విజయవంతానికి గల కారణాలను నేతలకు వివరించారు. మూడేళ్ల అణచివేతతో కార్యకర్తల్లో ఉన్న కసి, పాలకుల నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజల అసంతృప్తి మహానాడు దిగ్విజయానికి ప్రధాన కారణంగా చెప్పారు.

వాహనాలు కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి మహానాడును జయప్రదం చేశారని తెలిపారు. సొంతంగా వాహనాలను సమకూర్చుకుని రావడం రాజకీయ మార్పుకు నిదర్శనమని అన్నారు. మహానాడు నిర్వాహణలో మండువవారిపాలెం రైతులు భూములిచ్చి ఆదుకున్నారని, అలాగే ప్రకాశం జిల్లా నేతలు సమిష్టి కృషితో మహానాడు సక్సెస్‌ అయిందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని మిగిలిన జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. అధికార పార్టీ బస్సుయాత్రకు జనం వెలవెలపోతే మహానాడుకు ఎవరూ కంట్రోల్‌ చేయలేని స్థాయిలో జనం తరలివచ్చారని, ఇది తెలుగుదేశం పార్టీపై నమ్మకాన్ని చాటిందని చెప్పారు. గడప గడపకు వైకాపాను గడప గడపకు మన ప్రభుత్వమని మార్చారని అయినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని కాస్తా.. బస్సుయాత్రగా మార్చారని అన్నారు. బస్సుయాత్ర కూడా విఫలమైందని దీన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ముందుకు తీసుకువెళ్లాలని అలాగే సభ్యత్వ నమోదును శరవేగంగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేయాలని నేతలకు స్పష్టం చేశారు. ఇక పార్టీలో గ్రూపులు కడితే ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదని చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల తొలిగింపు, కొత్త ఓటర్ల నమోదు అంశంలో గ్రామస్థాయి నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు ఒంటరి వారు కాదని, ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నేతలకు సూచించారు. మహానాడు విజయాన్ని కార్యకర్తలకు అంకితమిస్తున్నామని ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేయాలని సూచించారు. స్థానిక సమస్యలు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ ముఖ్యనేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, మండల, గ్రామస్థాయి నేతలు పాల్గొన్నారు.

కోనసీమలో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించరా..?
కోనసీమలో వారం రోజులు గడిచినా ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని ఎక్కడో కాశ్మీర్‌లో కనిపించే పరిస్థితి కోనసీమలో వినాల్సి రావడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన ఐటీ ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం వాళ్లకు పనిచేసుకునే అవకాశాన్ని వెసులుబాటును లేకుండా చేయడం దారుణమన్నారు. ఇంటర్నెట్‌ ప్రస్తు పరిస్థితుల్లో సామాన్యుడి జీవితంలో ఒక భాగంగా మారిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్‌ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ అంశం లక్షలాది మంది ప్రజలకు సంబంధించిందని మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement