ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో జగన్ మోసపు రెడ్డి అని మరో సారి నిరూపించుకున్నారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ప్రజలపై 700 కోట్ల భారమే అన్నారు. కానీ, వాస్తవంగా పెంచింది రూ.1500 కోట్లు అని విమర్శించారు. ఆర్టీసీ చార్జీల బాదుడుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి అదనంగా రూ.1500 కోట్లు ప్రభుత్వం కొట్టేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో గడప గడపకూ పర్యటలో భాగంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీరును ఎండగట్టారు.
అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న ‘జగన్‌మోసపురెడ్డి’ ఇప్పిటకే 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని నారా లోకేష్ ఆరోపించారు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర పెరిగి సామాన్యులు బతకడం భారంగా మారిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ ఆక్షేపించారు.
ఇంటి పన్ను, చెత్త పన్ను పేరుతో వలంటీర్లు ప్రజలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, కట్టక పోతే సంక్షేమ కార్యక్రమాల డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు లోకేష్. చెత్త పన్ను వసూలు చేస్తున్నారే కానీ, ఎక్కడే చెత్త ఎత్తిన దాఖలాలు లేవని అన్నారు. ‘‘గ్రామాల్లో పరిశుభ్రత లోపించింది. కనీసం డ్రెయిన్లు కూడా శుభ్రం చెయ్యడం లేదు. పరిసరాలు పరిశుభ్రంగా లేక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చెత్త పన్ను కట్టించుకొని చెత్త ఎత్తకపోతే ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు చెత్త పొసే రోజు దగ్గర్లోనే ఉంది. స్థానిక ఎమ్మెల్యే చేతగాని తనంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ నుండి వేస్తున్న గౌతమ బుద్దా రోడ్డుకి కూడా మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ని వినియోగించారు. మున్సిపాలిటీ లో మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగించే నిధులు రోడ్డు నిర్మాణం కోసం వాడటం చేతగాని తనమే. గడప గడపకి వెళ్లాలని వైసిపి కార్యక్రమం ఇచ్చినా ఎమ్మెల్యే వెళ్లడం లేదు. ప్రజలు నిలదీస్తారు అన్న భయంతోనే గౌతమ బుద్దా రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టి వెళ్లిపోతున్నారు” అని లోకేష్ ధ్వజమెత్తారు.