విజయనగరం, ప్రభన్యూస్ : నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాల మాదిరిగానే లక్ష్య సాధన పట్ల రెవెన్యూ ఉద్యోగులు అలక్ష్యంగా వుండగా పాలకులు అచేతనంగా మిగిలిపోయారు. పేరుకు పాలకవర్గం వున్నప్పటికీ నగరపాలక సంస్థ పాలనతో వారికి ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల దాదాపుగా అన్ని డివిజన్లలో సమస్యలు రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధి ఎటూ లేకపోగా పౌర సేవలు పొందడం కూడా నగరపాలక సంస్థ పరిధిలోని జనాలకు గగనమైందని చెప్పేందుకు వెనుకాడాల్సిన పని లేదు.
పన్నుల వసూళ్ల విషయానికి వస్తే రెవెన్యూ విభాగం ఎంత నిర్లక్ష్యంగా వుందో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం ఆస్థి పన్ను రూ.50.50 కోట్లు వసూలు కావాల్సి వుండగా ఇంత వరకు రూ.17 కోట్ల మేర వసూలు కూడా గగనమైంది. అంటే 14 శాతం మేర వసూళ్లకు కూడా అతీగతీ లేకపోయిందన్న మాట. మరోవైపు నీటి పన్ను వసూళ్లు కూడా అంతే అధ్వాన్నంగా వున్నాయి. నీటి పన్ను రూపంలో రూ.4.91 కోట్ల మేర వసూలు కావాల్సి వుండగా 1.11 కోట్లకు కాస్త అటు ఇటుగా వసూలైన పరిస్థితి. 010 పద్దు ద్వారా జీతాలు ఇచ్చే పరిస్థితి అందుబాటులోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమకూర్పు విషయంలో విజయనగరం నగరపాలక సంస్థ సహా ఇతర మున్సిపాలిటీలు దృష్టి సారించిన పరిస్థితి లేకపోయిందని చెప్పేందుకు వెనుకాడాల్సిన పని లేదు.
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్నుకు సంబంధించి మొండిబకాయిలను ఉద్దేశపూర్వకంగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎంచక్కా రూ.20 కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. అసిస్టెంట్ కమిషనర్ వుండి కూడా రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ పని తీరు అధ్వాన్నంగా వుండడం విమర్శలకు తావిస్తోంది. పాలకవర్గం వున్నా 95 శాతం మంది అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతూ అచేతనంగా మిగిలిపోయిన దుస్థితి. ఫలితంగా నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోగా పౌర సేవలు పొందేందుకు కూడా ప్రజలు నోచుకోలేని దుస్థితి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే స్థితిలో లేకపోవడం రెవెన్యూ సిబ్బందికి కొండంత అండ ఇచ్చినట్లయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..