Tuesday, November 26, 2024

కేన్సర్‌పై యుద్ధమే, రాష్ట్రంలో ఏటా 70 వేల మంది బాధితులు

అమరావతి, ఆంధ్రప్రభ: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 2020లో ఏపీలో 34వేల మంది క్యాన్సర్‌ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 120 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు అం చనా. ప్రతి ఏటా క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈక్రమంలో అత్యాధునిక వైద్య విధానాలతో చికిత్స అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి ఏడాది క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది. నిరుడు 1.30 లక్షల మందికి చికిత్స అందించారు. ప్రతి 50 కి.మీకి క్యాన్సర్‌కు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం విశాఖపట్నం హోమీబాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు నాలుగు రోజుల క్రితం హోమీ బాబా ఆసుపత్రి వర్గాలతో చర్చించారు. క్యాన్సర్‌ వ్యాధి గుర్తించే స్క్రీనింగ్‌, జిల్లాల్లో ప్రివెంటివ్‌ అంకాలజీ, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపుదలకు శిక్షణను హోమీ బాబా ఆసుపత్రి ఇచ్చేవిధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారు. విశాఖ కింగ్‌ జార్జిచ తిరుపతి స్విమ్స్‌, చినకాకాని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సపై ఒప్పందం జరిగింది.

విలేజ్‌ క్లినిక్‌ స్థాయిలోనే గుర్తింపు

రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్‌ చికిత్స వనరుల్ని ఏపీ ప్రభుత్వం కోల్పోయింది. క్యాన్సర్‌ బారిన పడితే మెరుగైన వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మృత్యువాతపడుతున్నారు. చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదన్నది వైద్యుల అభిప్రాయం. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టి పెట్టినట్లైతే వ్యాధి బారినపడ్డ రోగుల ప్రాణాలు కాపాడవచ్చన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం విలేజ్‌ క్లినిక్స్‌, వార్డు క్లినిక్స్‌, పీహెచ్‌సీలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇవి పూర్తయితే క్యాన్సర్‌ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుందని వైద్యశాఖ అధికారులు అంచనా కట్టారు. వైద్య సిబ్బందికి క్యాన్సర్‌ స్కీన్రింగ్‌పై శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. టాటా మెమోరియల్‌ కు చెందిన హోమీ బాబా ఆసుపత్రితో పాటు స్విమ్స్‌ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్‌ నివారణపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మారుమూలల వరకు

మారుమూల ప్రాంతాలకు సైతం క్యాన్సర్‌ చికిత్సను అందుబాటు లోకి తెచ్చేలా యాక్షన్‌ప్లాన్‌ రూపొందిస్తున్నారు. చిన్న గ్రామంలో రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలక వెళ్ళకుండా సమీపంలోనే చికిత్స అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. నాలుగైదేళ్లలో రాష్ట్రంలో క్యాన్సర్‌ చికిత్స కు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే విధంగా వైసీపీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఏపీలో కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ ను అందుబాటులో కి తేవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 70 వేల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీరిలో 35 వేల మంది వరకూ చనిపోతున్నారు. 25శాతం మంది పొగాకు ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు వైద్య పరిశోధనల్లో తేలింది. ఈనేపథ్యంలో క్యాన్సర్‌ కు దారితీసే పొగాకు ఉత్పత్తుల్ని వాడొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్గించేందుకు వైద్యశాఖ నడుం బిగించింది. క్యాన్సర్‌ పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో పొగాకు విరమణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మానవళిని కబళిస్తున్న క్యాన్సర్‌పై పెద్ద యుద్ధమే చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement