ఆంధ్ర ప్రదేశ్ లో చేపలు, రొయ్యలతో పాటు పీతల పెంపకానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు ఆ అడవి పీతల జాతి అంతరించిపోయేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణమేంటో తెలియకుండానే వందలాది పీతలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వీటి మరణానికి మడ్ క్రాబ్ రియోవైరస్ (MCRV) కారణమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
M.S.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (MSSRF), సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ స్టడీ ఇన్ మెరైన్ బయాలజీ (అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు) ఆధ్వర్యంలో పీతల మరణాలపై పరిశోధనలు చేశారు. కృష్ణా జిల్లాలోని నాగాయలంకతోపాటు బహిరంగ మార్కెట్ నుండి సేకరించిన నమూనాల్లో మడ్ క్రాబ్ రియో వైరస్ (MCRV) ఉనికిని పరిశోధక బృందాలు గుర్తించాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నాగాయలంక ప్రాంతాల్లో 2019 నుంచే అడవి పీతలు చనిపోతున్నట్టు స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది.
స్లీపింగ్ డిసీజ్ అని పిలిచే మడ్ క్రాబ్ రియో వైరస్.. వ్యవసాయ పద్ధతిలో పెంచుతున్న అడవి పీతలపై ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. క్రాబ్ ఫ్యాట్‌నింగ్, క్రాబ్ పాలికల్చర్‌లో రొయ్యలు, అడవి పీతలను ఒకే చెరువులో లేదా ప్రత్యేకమైన ప్రాంతాల్లో (పీతల చెరువులలో) కల్చర్ చేస్తున్నారు.
వైరస్ స్వభావం ఏంటంటే..
కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో అడవి పీతల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడంలో సహాయపడాలని సాగు చేస్తున్న రైతుల బృందం ఇటీవల సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ అక్వాకల్చర్ చెన్నై శాస్త్రవేత్తలకు విజ్ ప్తి చేసింది. “ప్రస్తుతం ఉన్న చెరువుల్లో పీతల సామూహిక మరణాలు, నిర్వహణను పరిష్కరించడానికి మేము CIBA శాస్త్రవేత్తల సూచనల కోసం వేచి చేస్తున్నాం’’ అని నాగాయలంకకు చెందిన ఉప్పునీటి రైతులు చెప్పారు.
AP రాష్ట్ర మత్స్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నాటికి కృష్ణా జిల్లాలో 4,500 ఎకరాలతో సహా ఆంధ్రప్రదేశ్‌లో అడవి పీతల సాగు మొత్తం 25,000 ఎకరాలుగా ఉండేది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోనూ అడవి పీతల సాగు ఉంది.. అయితే 2019 నుండి ఏపీలో వీటి మరణాల కారణంగా కనీసం 60శాతం సాగు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి ఈ పీతలను నేరుగా ఆగ్నేయాసియా ప్రాంతానికి ఎగుమతి చేస్తారని, వీటికి మంచి డిమాండ్ కూడా ఉంటుందని చెబుతున్నారు అధికారులు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..