Wednesday, November 20, 2024

అండర్ బ్రిడ్జి నిండింది.. మరి ఎటునుంచి పోవాలే..

సంతమాగులూరు,(ప్రభన్యూస్‌): ఆ గ్రామానికి ఒకటే ప్రధాన రహదారి. గ్రామంలోని ప్రజలు బయటకు వెళ్లాలన్నా, పక్క గ్రామాల నుండి వచ్చే ప్రజలు గ్రామంలోకి రావాలన్నా ఆ రహదారి ఒక్కటే. ఆ గ్రామంలోకి వెళ్లాలంటే మొట్టమొదటి రైల్వే ట్రాక్‌ ఉన్నది. ట్రాక్‌ దాటితేనే గ్రామంలో కి వెళ్లేది. అంత ముందు రైలు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు రైల్వే గేటు ఉండేది. ఇప్పుడు ఆ రైల్వే గేట్లను మొత్తం తీసివేసి అండర్‌ బ్రిడ్జిలను నిర్మించారు. అదే క్రమంలో సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామం వద్ద అండర్‌ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం చేపట్టే సమయంలో గ్రామంలో నుండి బయటకు వెళ్ళటానికి, బయట గ్రామాలనుండి గ్రామంలోకి రావడం కోసం ప్రత్యామ్నాయంగా రైల్వే స్టేషన్‌ సమీపంలో స్టేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ మీదుగా రహదారిని ఏర్పాటు చేశారు.

అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే సమయంలోనే నీళ్లు వూటతో అండర్‌ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయేది. ఈ మధ్యకాలంలో స్టేషన్‌ ఎదురుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రహదారి ప్రక్కనే ప్లాట్‌ ఫామ్‌ నిర్మించేందుకు గోడ నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణానికి సంబంధించి వస్తువులు మొత్తం ఫ్లాట్‌ ఫామ్‌ పైనే రహదారికి అడ్డంగా వేసి ప్రత్యామ్నాయ రహదారి రైల్వే గేటును మూసివేశారు. ఈ సమస్యపై రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయి సమస్య సమస్యగానే ఉండిపోయిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

నిర్మాణంలో ఉన్న అండర్‌ బ్రిడ్జిలో నీళ్లు ఉన్నప్పటికీ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతూనే గ్రామం నుండి బయటికి వెళ్తున్నామన్నారు. ఉన్న ప్రత్యామ్నాయ రహదారిని రైల్వే అధికారులు మూసివేయడం ,సరైన రహదారి లేక ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ అండర్‌ బ్రిడ్జి శాశ్వత నిర్మాణం పూర్తి అయ్యే విధంగానూ, ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని నిన్న‌ గ్రామస్తులందరూ రైల్వే ట్రాక్‌ పై బైఠాయించారు. ఈ ట్రాక్‌ పై గ్రామస్తులు నిరసన తెలపడంతో గుంటూరు కాచిగూడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు గంటకు పైగా నిలచిపోయింది.

మా గ్రామ సమస్య పరిష్కరిస్థామని అధికారులు హామీ ఇచ్చేంత వరకు ఈ రైల్‌ రోకో కార్యక్రమాన్ని విరమించుకోమని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ నారాయణ రెడ్డి వెల్లాలచెరువు గ్రామానికి చేరుకొని సమస్యను రైల్వే అధికారుల దృష్టికి చరవాణి ద్వారా తీసుకువెళ్లగా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు- చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement