అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి ప్రాంతానికి అనుసంధానంగా కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద కృష్ణానదిపై మరో వంతెనకు డిజైన్లు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు శాసనసభ, సచివాలయం, హైకోర్టుకు కరకట్ట రోడ్డులో ప్రయాణించాలంటే సింగిల్ లైన్ వంతెన మాత్రమే ఉంది. దీంతో రాకపోకలకు అవరోధాలు ఎదురవుతున్నాయి.. ఎదురుగా వాహనం వస్తే మంత్రులు, వీవీఐపీల వాహనాలు సైతం అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రూ. 151 కోట్లతో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున అందుకు అనుగుణంగా కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద రెండు లైన్ల వంతెన నిర్మించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెంట్రల్ ఇరిగేషన్ డిజైన్స్ ఆర్గనైజేషన్ డిజైన్లు రూపొందించింది. దీనిపై సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వివేక్ యాదవ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు పది మీటర్ల నిడివితో ఈ రెండు లైన్ల వంతెన అందుబాటులోకి వస్తే సచివాలయానికి మార్గం సుగమం అవుతుంది. కాగా సువిశాలమైన రవాణా మార్గంగా కృష్ణానది కరకట్ట మార్గాన్ని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సం(ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్, సంబంధిత అధికారులను ఆదేశించారు. 1.6 మేర నిర్మాణం జరుగుతున్న కృష్ణా కరకట్ట పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.
ప్రముఖుల రాకపోకలకు ప్రధాన మార్గమైనందున ఆకర్షణీయమైన విద్యుత్తు దీపాలను ఇతోధికంగా చేపట్టాలన్నారు. కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం ఉన్న ఒకలైను వంతెన కారణంగా వాహనాలు ఎదురు పడినప్పుడు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఉన్నత న్యాయస్థానం లాంటి ప్రధాన ప్రదేశాలకు వెళ్లే వారి ప్రయాణ సమయం అధికమవుతుందన్నారు. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా నిర్మించనున్న నూతన వంతెన ద్వారా ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రించ వచ్చన్నారు. పది మీటర్ల విస్తీర్ణంలో రెండు లైన్లుగా నిర్మించనున్న ఆధునిక వంతెన డిజైన్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. వంతెన నిర్మాణ క్రమాన్ని నీటిపారుదలశాఖ అధికారులు కమిషనర్‌కు నివేదించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీసీఆర్డీఏ, ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు ఎన్.వి.ఆర్.కె.ప్రసాద్, కె. రాజేంద్రప్రసాద్, నీటిపారుదల, ఏడీసీ సూపరిం-టె-ండింగ్ ఇంజినీర్లు తిరుమలరావు, కె.రామ్మోహనరావు, డిఈఈ ఎం.గోవిందయ్య, మెగా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.